జనసంద్రం.. మన్యంకొండ | - | Sakshi
Sakshi News home page

జనసంద్రం.. మన్యంకొండ

Feb 2 2026 7:21 AM | Updated on Feb 2 2026 7:21 AM

జనసంద్రం.. మన్యంకొండ

జనసంద్రం.. మన్యంకొండ

గోవింద నామస్మరణతో మార్మోగిన గిరులు

ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న లక్ష మంది భక్తులు

రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం బుధవారం భక్తజన సందోహంతో పులకించిపోయింది. గోవింద.. గోవింద అనే నామస్మరణతో ఆలయ గిరులు మార్మోగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే రెండో తిరుపతిగా పేరుగాంచిన పుణ్యక్షేత్రానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున జరగనున్న ప్రధాన ఘట్టమైన రథోత్సవంలో పాల్గొనేందుకు ఒక్కరోజే సుమారు లక్ష మందికిపైగా భక్తులు వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భారీగా తరలివచ్చిన జనంతో మన్యంకొండ గుట్టలు జనసంద్రంగా మారాయి. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పేరుగాంచిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా దర్శించుకుంటే తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి.. మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలు తీరుతాయని నమ్మే భక్తజనులు పెద్దఎత్తున తరలివచ్చి ఎప్పుడెప్పుడు మహోన్నతమైన రథోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించాలని ఎదురుచూస్తున్నారు. కుటుంబాలతో వచ్చిన భక్తులు, పిల్లల చేతుల్లో లడ్డూలు, తలపై పూలమాలలతో స్వామివారి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. కొందరు భక్తులు మెట్లపై మోకాళ్ల మీద నడుచుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను క్రమబద్ధీకరించి, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో పోలీసు బందోబస్తు పెంచడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగలేదు.

ఆర్టీసీ పలు డిపోల నుంచి మన్యంకొండకు ప్రత్యేక బస్సులు నడిపింది. దీంతో గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన భక్తులు సులభంగా ఆలయానికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌– రాయిచూర్‌ ప్రధాన రహదారి పక్కన స్వామివారి ముఖద్వారం నుంచి ఆలయం వరకు భక్తుల రాకపోకలతో సందడి నెలకొంది. భక్తుల రాక దృష్ట్యా వసతి సౌకర్యాలు మెరుగుపర్చారు. జాతర ప్రాంగణంలో ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్మించిన వాటర్‌ట్యాంకులకు ముందుగానే నీరు నిల్వ ఉంచుతున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మన్యంకొండ దేవస్థానంతోపాటు చుట్టూ కొండలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో కొండలన్నీ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మన్యంకొండ క్షేత్రం భక్తిపారవశంతో పులకించిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement