మట్టి దిబ్బలు పడి బాలుడు దుర్మరణం
పాన్‌గల్: మట్టి దిబ్బలు మీద పడి బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఏదుల మండలం గుండ్యా వాల్యా నాయక్ తండాకు చెందిన లావుడ్యచంద్రు, లాలమ్మల కుమారుడు లావుడ్యరాముడు (15) కూలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇదే తండాకు చెందిన కాట్రావత్‌మోహన్ మట్టి తీసుకొచ్చేందుకు లావుడ్యరాముడు, లావుడ్యప్రసాద్, కాట్రావత్ లాలు నలుగురు కలిసి గత నెల 31న కిష్టాపూర్ గ్రామ శివారులో గల ముత్తదోన గట్టు దగ్గర వెళ్లారు. మట్టి తవ్వుతుండగా మట్టి పెడలు పడి లావుడ్యరాముడుకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఆదివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


