‘మహాకేఫ్’ పునఃప్రారంభం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ జంక్షన్‌లో ఆదివారం ‘మహాకేఫ్’ను పునఃప్రారంభించారు. గతేడాది ఆగస్టు 18న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. అయితే హడావుడిగా హనుమాన్‌పురాకు చెందిన ఆర్‌పీ పద్మకు మెప్మా అధికారులు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె సరిగా నిర్వహించలేక పోవడంతో ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఉన్నతాధికారులు వేరే వారికి కేటాయించాలని ఆదేశించారు. దీంతో గత నవంబర్ 21 నుంచి ‘మాహాకేఫ్’ను మూసివేయించారు. ఈ మొత్తం వ్యవహారంపై గత ఏడాది డిసెంబర్ 9న ‘సాక్షి’లో ‘ముచ్చటగా 3 నెలలకే..! జిల్లా కేంద్రంలో మూతబడిన మహాకేఫ్’ శీర్షికన కథనం ప్రచురితమైంది.స్పందించిన ఉన్నతాధికారులు చివరకు గత నెల 26న మరో ఆర్‌పీ వందనకు చెందిన గ్రూపునకు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తాజాగా ‘మహాకేఫ్’ను ఇప్పుడు తిరిగి తెరిచారు.
దేవరకద్ర కోర్టుకు గెజిట్ విడుదల
దేవరకద్ర: దేవరకద్రలో ఏర్పాటు చేసే జూనియర్ సివిల్ జడ్జి మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు సంబంధించి గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కోర్టుకు సంబంధించి పరిపాలన అనుమతులు ఇస్తూ గెజిట్‌లో వెల్లడించారు. దేవరకద్ర కోర్టు పరిధిలో చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, దేవరకద్ర రెవెన్యూ మండలాలను చేర్చుతూ గత నెల 22న విడుదల చేసిన గెజిట్ నోట్‌లో పేర్కొన్నారు. అయితే కోర్టుకు సంబంధించిన గెజిట్ నోట్ శనివారం సాయంత్రం అందడంతో ఆదివారం ఈ విషయం ప్రకటించారు. కాగా.. దేవరకద్రలో కోర్టు ఏర్పాటు కోసం ఇప్పటికే భవనం సిద్ధం చేశారు. పాత మండల పరిషత్ కార్యాలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. కోర్టుకు కావాల్సిన గదులను సమకూర్చారు. గతంలోనే పలుమార్లు జిల్లా జడ్జిలు కోర్టు భవనాన్ని పరిశీలించి వెళ్లారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మున్సిపల్ ఎన్నికల తర్వాత కోర్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
‘మహాకేఫ్’ పునఃప్రారంభం
‘మహాకేఫ్’ పునఃప్రారంభం


