ప్రకృతి వ్యవసాయానికి బలమైన అడుగు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయానికి బలమైన అడుగు

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

ప్రకృతి వ్యవసాయానికి బలమైన అడుగు

ప్రకృతి వ్యవసాయానికి బలమైన అడుగు

సఖిలకు ముగిసిన ఐదు రోజుల శిక్షణ

రైతు భవిష్యత్‌కు దిశానిర్దేశం

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ కింద జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా అమలు చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన తొలి విడత శిక్షణ కార్యక్రమం సఖిలలో విజయవంతంగా ముగిసింది. గత నెల 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు కొనసాగిన ఈ శిక్షణలో జిల్లాలో ఎంపికై న 20 క్లస్టర్లకు చెందిన కమ్యూనిటీ రిపోర్ట్స్‌ పర్సన్లు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం కేవలం సమాచారానికి పరిమితం కాకుండా, వ్యవసాయ విధానంలో మౌలిక మార్పులకు బీజం వేసిన కార్యక్రమంగా నిలిచింది. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, నేలలో సారవంతం తగ్గుదల, రసాయన కాలుష్యం, దిగుబడుల నాణ్యత తగ్గడం తదితర అన్నింటికీ ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ శిక్షణకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.

ఇవీ ప్రధానాంశాలు..

శిక్షణ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం యొక్క తత్వం, అవసరం, దీర్ఘకాల ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా నేల ఆరోగ్యం ప్రాధాన్యత, పంటల మార్పిడి, రసాయన రహిత ఎరువుల తయారీ, వినియోగం, పురుగు, తెగుళ్ల నివారణకు కషాయాలు, జీవసారాలు, సమగ్ర, సుస్థిర వ్యవసాయ విధానం, దేశవాళి విత్తనాల వినియోగం వంటి అంశాలను శాసీ్త్రయంగా, ఆచరణాత్మకంగా వివరించారు. రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులపై ఆధారపడటం వల్ల ఏర్పడుతున్న ఆరోగ్య, పర్యావరణ సమస్యలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.

తక్కువ పెట్టుబడితో..

ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించడం. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల జీవ వైవిధ్యాన్ని పెంపొందించి, వాయు– నీరు– నేల కాలుష్యాన్ని తగ్గిస్తూ.. రైతు ఆదాయాన్ని స్థిరంగా పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వివరించారు. ఇది కేవలం ఒక పద్ధతి కాకుండా, రైతు జీవన విధానంలో మార్పు తీసుకొచ్చే ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

గ్రామ స్థాయికి విస్తరణ..

క్లస్టర్‌ కమ్యూనిటీ రిపోర్ట్స్‌ పర్సన్లకు శిక్షణ ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన వ్యూహం. వీరు గ్రామ స్థాయిలో రైతులకు మార్గదర్శకులుగా మారడం. ఈ 20 మంది శిక్షణార్థులు తమ తమ క్లస్టర్ల పరిధిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేసి, రైతులు ఆచరణకు ప్రోత్సహించే కీలక పాత్ర పోషించనున్నారు.

ముగింపు కార్యక్రమం

శిక్షణ చివరిరోజు కృషి సఖిలలో ముగింపు కార్యక్రమం నిర్వహించగా.. జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్‌ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం రైతు ఆరోగ్యానికే కాకుండా.. సమాజం, పర్యావరణ భవిష్యత్‌కూ అవసరం అని పేర్కొన్నారు.

ముగింపు మాట

మొత్తంగా చూస్తే, ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి బలమైన పునాది వేసినట్టుగా భావించవచ్చు. ఇది మొదటి అడుగే అయినప్పటికీ.. భవిష్యత్‌లో మరింత మంది రైతులు ఈ మార్గంలో నడిచేలా చేస్తే, సుస్థిర వ్యవసాయంతో సమృద్ధమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement