మట్టిలో పోషకాల ఆధారంగా పంటల సాగు
జడ్చర్ల: మట్టిలో పోషకాల ఆధారంగా పంటలు సాగు చేయాలని డీఏఓ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్టెబోయిన్‌పల్లి గురుకుల విద్యాలయంలో మట్టి ప్రాముఖ్యత, మట్టి నమూనాల సేకరణ, మట్టిలో ప్రధాన, సూక్ష్మ పోషకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 50 మంది విద్యార్థులను రైతులుగా ఎంపిక చేసి మట్టి నమూనాలు సేకరించి ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ పంటలు సాగుకు సంబంధించి విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వాడటం వలన భూమిలో పోషకాలు నిర్జీవంగా మారే అవకాశం ఉందన్నారు. అంతేగాక నేల, గాలి, నీటి కాలుష్యం ఏర్పడుతుందని, రసాయన ఎరువులను వినియోగించడం కారణంగా సాగు వ్యయం పెరుగుతుందన్నారు. మట్టి పరీక్షల ఫలితాల ఆధారంగా లోపాలను గుర్తించి సరైన పోషకాల రక్షణ చర్యలు చేపడితే నేల ఆరోగ్యకరంగా ఉండి ఎక్కువ దిగుబడులు వస్తాయన్నారు. వి ద్యార్థి దశలోనే నేలపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్‌లో మంచి పరిణామాలు ఉద్భవించే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో ఏఓలు గోపినాథ్, ప్రదీప్‌కుమార్, భూసార పరీక్ష కేంద్రం ఏఓ రేవతి, ఏఈఓలు నవనీత, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, నోడల్ అధికారి అయేషా తదితరులు పాల్గొన్నారు.


