ఉల్లి ధర తగ్గుముఖం
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో మూడు వారాలుగా పెరుగుతూ వచ్చిన ఉల్లి ధర బుధవారం ఒక్కసారిగా పడిపోయింది. కొత్త ఉల్లి వచ్చిన ప్రారంభంలో కనిష్ట స్థాయికి పడిపోయిన ఉల్లి ధరలు మూడు వారాల నుంచి పెరుగుతూ వచ్చాయి. వారం గడవక ముందే మళ్లీ ధరలు మొదటికి వచ్చాయి.
రూ.1,700 పలికిన ధర
మార్కెట్‌లో జరిగిన ఉల్లి వేలంలో గరిష్ట ధర క్వింటాల్‌కు రూ.1,700లు పలికింది. గత వారం రూ. 2600 వరకు గరిష్ట ధర పలికిన క్వింటాల్ ఏకంగా రూ.900 వరకు తగ్గింది. కనిష్ట ధర రూ.1100 వరకు పడిపోవడంతో గత వారంతో పోల్చితే రూ. 800 వరకు ధర తగ్గుదల కనిపించింది. ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మార్కెట్‌కు దాదాపు అయిదు వందల బస్తాల ఉల్లి విక్రయాలు జరిపారు. వేలంలో కొనుగోలు చేసిన ఉల్లి 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ. 850, కనిష్టంగా రూ. 550గా విక్రయించారు.


