కావేరమ్మపేటలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
జడ్చర్ల: కావేరమ్మ పేటలో ఓ పాడుబడిన పురాతన ఇంటిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన ఘటన బుధవారం వెలుగు చూసింది. కావేరమ్మపేటకు చెందిన తల్లోజు లక్ష్మికి సంబంధించిన ఇంటిలో ఆరు నెలలుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు గుప్తనిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఆ ఇంటి పనులు చేపడుతున్నట్లు యజమానులు చెబుతుండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఇంటి ప్రహరీ లోపల చేస్తున్న తవ్వకాలు బయటకు కూడా కనిపించకపోవడంతో పలు చోట్ల గోతులు తవ్వడం, పూడ్చడం వంటివి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు విషయాన్ని గ్రహించి సమాచారం చేరవేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి తవ్వకాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. కాగా కావేరమ్మపేటలోని పాత ఇళ్లలో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం కొంత కాలంగా ఉంది. గతంలో ఇదే ప్రాంతంలో ఓ పాడుబడిన ఇంటిలో తవ్వకాలు చేయగా.. వెండి నాణెలు బయట పడ్డాయి. గుట్టుగా ఉన్న ఈ విషయం బయటపడడంతో అప్పట్లో ఆర్డీఓ, పోలీసు ఉన్నతాధాకారులు స్పందించి నిర్విరామంగా రెండు రోజుల పాటు జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. అప్పుడు కూడా కొన్ని వెండి నాణెలు లభించాయి. వాటన్నింటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ కోవలోనే గుట్టుగా గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్నట్లు తెల్సింది.
సైబర్ మోసం.. ఖాతా నుంచి నగదు ఖాళీ
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు నగదు చోరీకి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్ బుధవారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సంతబజార్ కాలనీకి చెందిన అబ్దుల్‌నయీం ఫోన్‌కు ఈ నెల 10న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు గడువు ముగుస్తుందని, అప్‌డేట్ చేయాలని చెప్పడంతో నమ్మాడు. తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని సైబర్ నేరగాళ్లకు చెప్పడంతో అబ్దుల్‌నయీం బ్యాంకు ఖాతా నుంచి రూ.65,361 నగదు బదిలీ అయ్యింది. గుర్తించిన బాధితుడు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


