హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
గద్వాల క్రైం: గూడ్స్ వాహనంతో బైక్‌ను ఢీకొట్టి మాజీ సర్పంచ్‌ను హతమార్చిన కేసులో తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో సీఐ టి.శ్రీను విలేకర్లకు వెల్లడించారు. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు (41), అదే గ్రామానికి చెందిన మిల్లు వీరన్న కుటుంబ సభ్యుల మధ్య పాత కక్షలు, రాజకీయ వైరం, ఆర్థిక విభేదాల నేపథ్యంలో ఇరువురి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భీమరాయుడిని ఎలాగైనా అడ్డు తొలగించాలనే లక్ష్యంతో మిల్లు వీరన్న కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కె.వెంకటాపూర్‌కు చెందిన ఈడిగ ఈశ్వర్‌గౌడ్‌ను కలిసి చర్చించారు. అతడి హత్యకు రూ. 25లక్షల ఒప్పందం చేసుకున్నారు. సుపారీ తీసుకున్న ఈశ్వర్‌గౌడ్.. భీమరాయుడి హత్యకు వ్యూహం రచించారు. అందులో భాగంగా తనకు తెలిసిన వ్యక్తులను ఈ వ్యూహంలో భాగస్వామ్యం చేసుకున్నారు. నవంబర్ 21న మృతుడు గద్వాల నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. ధరూర్ మండలం జాంపల్లి స్టేజీ సమీపంలో గూడ్స్ వాహనంతో ఢీకొట్టి హతమార్చారు. ఈ కేసులో 10 మంది నిందితులను నవంబర్ 27న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు ఈశ్వర్‌గౌడ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం కర్నూలు జిల్లాలోని కాల్వబుగ్గ గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ఈశ్వర్‌గౌడ్‌పై గతంలోనే రెండు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కట్టుకున్న భార్యను హత్యచేసి పత్తికొండ సబ్ జైలుకు సైతం వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు.. మంత్రాలయంలోని కోస్గిలో జరిగిన ఫ్యాక్షన్ గొడవలో నాటుబాంబులు వేసిన ఘటనలో అరెస్టయి ఆదోని సబ్‌జైలుకు వెళ్లాడని తెలిపారు. అతడిని గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఈ హత్య కేసులో మరి కొంతమ ంది ఉన్నారని.. వారిని సైతం త్వరలోనే అదుపులో కి తీసుకుంటామన్నారు. నిందితుడి నుంచి బైక్, సె ల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఐలు శ్రీహరి, శ్రీనివాసులు ఉన్నారు.


