చోరీ కేసులో నలుగురికి రిమాండ్
వనపర్తి రూరల్: జిల్లా పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వరావు తెలిపారు. బుధవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు జలేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న వనపర్తి పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీకి వెళ్లే దారిలో మహిళా నడుచుకుంటూ వెళ్తుండగా బంగారు గొలుసు చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నెల 23న నాగవరం దగ్గర వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుల్లో ఇద్దరు బైక్, మరో ఇద్దరు కారులో పారిపోతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకొని విచారించగా అమరచింత మండలం నాగల్‌కడ్మూర్‌కు చెందిన ఏ1 కుర్వ రాములు, ఏ2 గట్టు వెంకటేష్, ఏ3 డ్యామ్ వెంకటేష్, ఏ4 బండమీది రాజేష్ ముఠాగా ఏర్పడి 2024 నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్లు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 104 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైకులు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కేసును త్వరితగతిన చేధించిన సిబ్బందిని ఎస్పీ సునీతారెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు.


