సహజ వనరులు కాపాడాలి
మాగనూర్: సహజ వనరులను కాపాడాలని చిట్యాల గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మాగనూర్ మండల పరిధిలోని మందిపల్లి గ్రామ పెద్దవాగు నుంచి టీజీఎండీసీ అనుమతులతో మక్తల్‌కు చెందిన ఓ వ్యక్తి ఇసుక తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్లను బుధవారం రెండో రోజు కూడా గ్రామ రైతులు అడ్డుకున్నారు. మాగనూర్ మండలంతో పాటు మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన రైతుల పొలాలు మందిపల్లి పెద్ద వాగు పరిసరాలలో ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు ఇసుకను తవ్వి తరలిస్తే బోర్లు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా చిట్యాల గ్రామం మీదుగా ఇసుక తరలించేందుకు మట్టి రోడ్డు నిర్మిస్తుండటంతో ప్రధాన రోడ్డు ధ్వంసం కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు ఇసుక అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామని చిట్యాల గ్రామ రైతులు తెలిపారు.


