గ్రామకంఠ భూమిని కాపాడాలని బైఠాయింపు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తమతండాకు చెందిన గ్రామకంఠ భూమిని కాపాడాలని కోరుతూ జడ్చర్ల మండలం కొత్తతండాకు చెందిన తండావాసులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో బైఠాయించి గంటపాటు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ బయటకు రావాలని నినాదాలు చేసినా కలెక్టర్ స్పందించలేదు. చేసేదిలేక తండావాసులు మీటింగ్ హాల్‌లోకి వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొత్తతండావాసి రమేశ్‌నాయక్ మాట్లాడుతూ.. కబ్జాకోరుల నుంచి కొత్తతండా జీపీకి చెందిన భూమిని కాపాడాలని కోరారు. జీపీ పరిధిలోని 135/లు2ఇ, 135/లు2ఇ/2 సర్వే నెంబర్లలో గతంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపనం చేసినట్లు తెలిపారు. దీంతోపాటు పల్లెప్రకృతి వనం, నర్సరీలు ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించి కొంతమంది కబ్జాదారులు జీపీ భవన నిర్మాణం జరిగే స్థలాన్ని కబ్జాచేసి ఇతర నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. గ్రామానికి చెందిన బోరు, పల్లెప్రకృతి వనం, నర్సరీలను తొలగించి దౌర్జన్యంగా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ సరైన హామీ ఇవ్వలేదని ఆరోపించారు. కార్యక్రమంలో చందర్‌నాయక్, అంత్యనాయక్, లక్ష్మణ్, భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.


