థర్డ్‌క్లాస్ ప్రచారం సరికాదు
● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి: డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల మాటలను విశ్వసించి థర్డ్‌క్లాస్ ప్రచారం చేయటం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధినేత కూతురుగా విచక్షణతో మాట్లాడుతారనే భావనను కవిత పొగొట్టారన్నారు. పెబ్బేరు సంత విషయంలో పూజారులకు ఇచ్చిన స్థలాన్ని ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు. పలుమార్లు కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. కేసీఆర్ సాన్నిత్యాన్ని, గులాబీ జెండాను, ఉద్యమబాటను వదిలిపెట్టలేదన్నారు. వనపర్తిలో 32 మంది బీసీలపై కేసులు చేయించామనే ఆరోపణలు, కబ్జాలు చేసినట్లు గానీ, మీ వెనక ఉన్న కాంగ్రెస్ నాయకుల సహకారంతో నిరూపించి చర్యలు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. పెబ్బేరు సంతస్థలంపై గత సాధారణ ఎన్నికల సమయంలో కొందరు అవగాహన లేని నాతో పని చేసి బయటకు వెళ్లిన వారు చేసిన ఆరోపణలను ఇప్పటి వరకు నిరూపించలేదన్నారు. నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరును నేనుగా పెట్టుకోలేదదని, ప్రజలిచ్చారని చెప్పారు. పాత చెరువులకు గండ్ల కొడితే.. రెండు బ్రాంచ్ కెనాల్స్ రేవంత్‌రెడ్డి పాలనలో నిర్మాణం చేశారా అని ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదువుకున్న కవిత ఎంతో పరిపక్వత చెందిన నాయకుడి కూతురుగా.. ఆయన సూచనల మేరకు రాజకీయంలోకి వచ్చిన ఆమె ఇలాంటి అవగాహనరాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని ఊహించలేదన్నారు. నీకు లిక్కర్ రాణి అనే పేరు ఎలా ప్రజలు ఇచ్చారో.. నాకు నీళ్ల నిరంజన్‌రెడ్డి అని రైతులు పేరు పెట్టారన్నారు. ఇప్పటి వరకు కవితకు దందాలే తెలుసనుకున్నానని, పుచ్చలు లేచిపోతాయని బెదిరింపులు చేస్తే.. దందాలతో పాటు దాదాగిరీ కూడా నేర్చుకున్నారని అనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కూతురనే కారణంగా ఆయన్ను బాధపెట్టొద్దని మా కార్యకర్తలెవ్వరిని మాట్లాడనివ్వటం లేదన్నారు. లేదంటే.. సోషల్ మీడియాలో దుర్బాషలాడి పోస్టులు పెట్టించడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయటం మేమూ చేయగలమన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయదవ్, పాల్గొన్నారు.


