పుచ్చ లేచిపోతుంది
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
వనపర్తి: ‘తండ్రి వయస్కుడని ఎక్కువగా మాట్లాడటం లేదు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చెలు లేచిపోతాయ్’ అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రెండురోజులుగా వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆయన పుచ్చు వంకాయలనే కామెంట్లు ఎలా చేశారట మరోసారి ఇలా మాట్లాడితే.. మర్యాద ఇవ్వబోనని హెచ్చరించారు. వనపర్తి జిల్లాలో వింతలు చాలానే ఉన్నాయి. పెబ్బేరులోని మార్కెట్ గోదాంలో రూ.కోట్ల విలువ చేసే గన్నీబ్యాగులు ఎండలకు ఎలా మంటలు చెలరేగి కాలిపోతాయి ఇప్పటి వరకు ఎక్కడైనా చూశామా.. అని ప్రశ్నించారు. పెబ్బేరు మండలం పాతపల్లిలో 50 మంది నుంచి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మాణం చేసేందుకు కాంట్రాక్టర్ రూ.80 వేలు తీసుకున్నారని ఆరోపించారు. పెబ్బేరు సంతలోని స్థలాలను మాజీ మంత్రి అండదండలతో కబ్జా చేశారని, ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వకుండా పాత చెరువులకు గండ్లు కొట్టి నీళ్లు తెచ్చిన నీకు నీళ్ల నిరంజన్ రెడ్డి అన్న పేరేందుకన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే, మంత్రిగా పని చేస్తే.. మూడు ఫాంహౌస్‌లు ఎలా కట్టారని, ఈ విషయం కేసీఆర్‌కు తెలియకుండా హరీశ్‌రావు ఏమన్నా ఆపాడా అని ప్రశ్నించారు. మీ ఫాంహౌస్‌లో అసైన్డ్, ఆర్డీఎస్ కోసం సేకరించిన భూమి ఉందట, కృష్ణానది కాల్వను సైతం కబ్జా చేశారట... ఇన్ని ఆరోపణలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదని నిలదీశారు. మూడుచోట్ల ఫాంహౌస్‌లు ఎలా నిర్మాణం చేశారో చెప్పాలన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎలా మంటల్లో కాలిపోయిందో తేలుస్తామన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే.. ఎందుకు భయపడుతున్నారు. భూ దాహం, ధన దాహంకు హద్దులు లేవా.. 32 మంది మంది బీసీ బిడ్డలపై కేసులు ఎలా పెడతారని కవిత మండిపడ్డారు.


