
రైతే ధర నిర్ణయించే రోజులు రావాలి
● మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్
● అట్టహాసంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రథమ మహాసభలు ప్రారంభం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రైతుల కష్టంతో పండించిన పంటలకు రైతులే గిట్టుబాటు ధరలు నిర్ణయించే రోజులు రావాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. రెండు రోజులపాటు నిర్వహించనున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మెట్టుగడ్డ నుంచి బాయ్స్ కాలేజీ వరకు రైతులతో భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆగస్టు 15న దేశ ప్రజలకు అండగా ఉంటానన్న ప్రధాని మోదీ మరుసటి రోజే విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకొని దిగుమతి సుంకాన్ని ఎత్తివేశారని ఆరోపించారు. విదేశాల పత్తిని కొనుగోలు చేయడంతో ఇక్కడి పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అదానీ, అంబానీ లాంటి కంపెనీలు వచ్చి రాబోయే కాలంలో రైతులను పీడించనున్నాయన్నారు. ఫిబ్రవరిలో 10లక్షల టన్నుల యూరియాను తెలంగాణకు ఇస్తామని చెప్పి సగం కోత విధించారని ఆరోపించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వమంటే కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. సినిమా టికెట్లు రేట్లు పెంచుకునే అధికారం ఇచ్చినప్పుడు రైతులు పండించిన పంటకు రేట్లు పెంచుకునే అధికారం ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. ఇవన్నీ విషయాలపై కొట్లాడితే అర్బన్ నక్సల్స్ అంటున్నారని, హిందూ ముస్లిం గొడవలు తెచ్చి దేశద్రోహులుగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. పాలకులు తీసుకొస్తున్న చట్టాలన్నీ రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. రైతులు తమ హక్కుల సాధనకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు మాట్లాడుతూ.. రైతాంగం నేడు దుర్భరమైన స్థితిలో ఉందన్నారు. ఓట్ల దొంగతనం చేసి అధికారంలోకి వచ్చారని ప్రతిపక్షం ఆధారాలతో నిరూపిస్తే వారిని అణచివేసే కుట్రలు చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. పాలమూరు బిడ్డనని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి పథకానికి అరకొర నిధులు కేటాయించడం తగదన్నారు. కార్యక్రమంలో రైతు, కార్మిక, విద్యార్థి, యువజన సంధాల నేతలు సాంబశివుడు, కాశీనాథ్, యాదగిరి, రాజన్న, కొండారెడ్డి, మణ్యం, రామకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

రైతే ధర నిర్ణయించే రోజులు రావాలి