
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని డీటీఓ శ్రీనివాస్ అన్నారు. సోమవారం టీడీఓ కార్యాలయంలో పెన్షనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యాలయానికి వచ్చే పెన్షనర్లను వేధించకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. వారు అడిగిన సమాచారాన్ని అందించాలని అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే సావదానంగా వివరించాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 75 ఏళ్లు పైబడిన పెన్షనర్లతో స్వయంగా ఎస్‌టీఓలను కలిసి వ్యక్తిగత నిర్ధారణ చేసుకోవాలన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను త్వరగా మంజూరు చేయాలని, పే కమిషన్ రిపోర్టు ప్రకటించాలని, జిల్లాకేంద్రంలో రాష్ట్ర రాజధానితో పెన్షనర్ల సంక్షేమ భవనాలను నిర్మించాలని, నగదు రహిత వైద్య సేవలు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో వైద్యులు, మండలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతితో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీటీఓకు అందజేశారు. సమావేశంలో యూనియన్ గౌరవాధ్యధ్యక్షుడు బాలస్వామి, అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి రహమాన్, ఉపాధ్యక్షులు వీరేందర్‌జీ, వీణాదేవి, కార్యదర్శులు ఖాజమ్మ, తులసమ్మ, బాలశివుడు, సభ్యులు కొండారెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు.