
డబ్బు రాజకీయాలు మారాలి
● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
● సురవరం పుస్తకావిష్కరణ
వనపర్తిటౌన్: ఈసీ ఓట్ల చోరీపై రాహుల్‌గాంధీ చేస్తున్న పోరు తరహాలో డబ్బు రాజకీయాలను మార్చేందుకు యువత ముందుకు రాకపోతే దేశాన్ని ఎవరూ రక్షించలేరని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సురవరం ప్రతాప్‌రెడ్డి పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వందేళ్లలో పూర్తి చేయాల్సిన పనులను 50ఏళ్ల జీవితంలో పూర్తి చేసి తరగని ముందుచూపుతో కాలంకంటే ముందు నడిచిన మేధావిగా సురవరం ప్రసిద్ధికెక్కారని చెప్పారు. ప్రతాపరెడ్డిలాంటి మహోన్నతుడు భవిష్యత్‌లో పుట్టడం అసాధ్యమన్నారు. వనపర్తిలో సురవరం, ప్రజావైద్యుడు మాధవరెడ్డి విగ్రహాలను వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామన్నారు. సురవరం కుమారుడు డాక్టర్ కృష్ణవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతాపరెడ్డికి రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజానికి పరితపించిన సురవరం రచనలు, కృషి సామాన్యుల దరికి చేరాల్సిన అవసరం ఉందన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో వనపర్తి సైనికులు
ఇండియన్ ఆర్మీలో వనపర్తి, హైదరాబాద్ సైనికులు ప్రధాన భూమిక పోషించారని తెలంగాణ చరిత్ర అధ్యయన కేంద్రం చైర్మన్, మానవ వనరుల విభాగం రాష్ట్ర ప్రతినిధి పాండురంగారెడ్డి, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పోరుగడ్డతోపాటు కళం గడ్డగా ప్రసిద్ధి చెందిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో వనపర్తి సైనికులు పాల్గొన్నారని, ఈ ప్రాంతం విశేష ప్రాధాన్యత కలిగినదన్నారు. కార్యక్రమంలో నాయకులు శిల్ప, అనురాగ్‌రెడ్డి, భీంపల్లి శ్రీకాంత్, అమరేందర్‌రెడ్డి, బిక్షం, జలంధర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, రాజేంద్రప్రసాద్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.