
శాంతియుత వాతావరణంలో పండుగలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): శాంతియుత, ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులు, నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయి సహాయసహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు ,శోభాయాత్ర నిర్వహించే వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 27న వినాయక చవితి, సెప్టెంబర్ 5న నిమజ్జనం, వచ్చే నెల 5 లేదా 6వ తేదీల్లో నిర్వహించే మిలాద్–ఉన్–నబీ వేడుకలకు భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడా అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణ సజావుగా జరిగేలా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఆర్‌డీఓ, డీఎస్పీలతో కూడిన అధికారుల కమిటీ పర్యవేక్షణ చేయనున్నట్టు తెలిపారు. నిమజ్జనం చేసే ప్రాంతాల వద్ద రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు విధులు నిర్వహించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది పంచాయతీలు, నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్–బీ అధికారులు క్రేన్ ఏర్పాటు చేయాలని, మండపాల నిర్వాహకులు మండపాల వద్ద తడి, పొడి చెత్త సేకరణకు డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రథమ చికిత్స, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనానికి విగ్రహాల తరలింపు కోసం వాహనాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌పోర్ట్ అధికారిని ఆదేశించారు. మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద మత్స్యశాఖ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
● ఎస్పీ జానకి మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్ https:police portal.tspolice.gov.in/indes.htm సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. పోలీస్‌శాఖ తరఫున తగిన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంటపాల వివరాలను ట్రాన్స్‌కో అధికారులకు తెలియజేసి, ఆ శాఖ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయించుకోవాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజలకు అసౌకర్యం కలగకుండా వినాయక మంటపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజే సౌండ్లను వినియోగించవద్దని సూచించారు. మండపాల వద్ద భక్తి పాటలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి మట్టి విగ్రహాల వాడకంపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఏనుగు నరసింహారెడ్డి, ఏఎస్పీ రత్నం, డీపీఓ పార్థసారథి, ఆర్‌డీఓ నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శంకరాచారి, వీహెచ్‌పీ అధ్యక్షుడు యాదిరెడ్డి, ఎంఐఎం అధ్యక్షులు హాదీ, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ ప్రశాంతంగా జరుపుకోవాలి
నిర్వాహకులు, ప్రజలు పూర్తిగా సహకరించాలి
శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయేందిర
మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్పీ జానకి