
వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్
● జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిబి.పాపిరెడ్డి
పాలమూరు: సెప్టెంబర్ 13న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌లో భారీస్థాయిలో కేసులు రాజీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కక్షిదారులకు నోటీసులు అందజేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి వెల్లడించారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్‌లో శనివారం అన్ని రకాల కోర్టుల న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, ఏపీపీఓలు, ఇన్సూరెన్స్ ప్యానల్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, డ్రంక్‌అండ్‌డ్రైవ్, ఈపెట్టీ, ఎంవీఓపీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు అధికంగా రాజీ అయ్యే విధంగా దృష్టి పెట్టాలన్నారు. ఆయా స్టేషన్ పరిధిలో ఉన్న కక్షిదారులకు నోటీసులు అందజేసి లోక్ అదాలత్‌కు తప్పక హాజరయ్యే విధంగా కృషి చేయాలన్నారు. బీమా కంపెనీల నిర్వాహకులు, బ్యాంకు అధికారులు సైతం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులు గుర్తించి సదరు కక్షిదారులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు శారదాదేవి, ఇందిర, అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, సీఐలు, ఇన్సూరెన్స్ కంపెనీల సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.