
సీపీఎస్ రద్దు కోసం ఉద్యమం ఉధృతం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ విధానం రద్దు కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి అన్నారు. జీఓ 28కి వ్యతిరేకంగా సీపీఎస్ ఉద్యోగులు బ్లాక్ డే నిర్వహించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నీటి పారుదల కార్యాలయాల్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జీఓ 28 ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసే వరకు ఉద్యోగ సంఘాల జేఏసీ, టీఎన్‌జీఓ సీపీఎస్ ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ మాట్లాడుతూ జీఓ 28కి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పెద్ద ఎత్తున బ్లాక్‌డే దినంగా పాటించి నిరసన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం జీఓ 28ని తెచ్చిందని ఆరోపించారు. సీపీఎస్‌తో ఉద్యోగులకు ఎలాంటి భద్రతలేదన్నారు. పెన్షన్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు అని అలాంటి హక్కును ఉద్యోగికి లేకపోవడం దుర్మార్గమన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేదాక పోరాటం చేస్తామన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ విజయేందిరకు అందజేశారు. కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ వెంకటేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, నాయకులు మల్లేష్, ఇనాయత్, కృష్ణారెడ్డి, రామానాయుడు, వెంకటేశ్, బాల్‌రాజు, లక్ష్మయ్య, విజయ్, భాస్కర్, శ్రీనివాస్‌రావు, కుర్మయ్య శాంసన్, ప్రియాంక, నీలిమ, ఖరేషీ, అశోక్, సయ్యద్, శేఖర్, శ్రీనివాస్‌రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.