
ఉత్సాహంగా ఈశా గ్రామోత్సవం
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం 17వ ఈశా గ్రామోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. పాలమూరులో మూ డోసారి గ్రామోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈశా ఫౌండేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి పురుషుల వాలీబాల్ పోటీల్లో 22 జట్లు పాల్గొన్నాయి. పోటీల ప్రారంభోత్సవంలో జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
● గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందని జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ అన్నారు. క్రీడలతోనే మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఇలాంటి క్రీడాపోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని ప్రతిభచాటి జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతినిధులు మాట్లాడుతూ 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింప చేయడానికి ఉద్దేశించినదని అన్నారు. క్లస్టర్ (జిల్లాస్థాయి), డివిజనల్ (రాష్ట్రస్థాయి), ఫైనల్ (దక్షిణభారత దేశ రాష్ట్రాల పోటీ) మూడు దశల్లో మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. ప్రతిస్థాయిలో మొదటి నాలుగుస్థాయిల్లో నిలిచిన జట్లకు మెరిట్ సర్టిఫికెట్, నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన నుపుర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ బృందం చేసిన నృత్య ప్రదర్శన అలరించింది.
వాలీబాల్‌లో తలపడుతున్న క్రీడాకారులు