
నిర్వాసితులకు చికెన్ భోజనం కంటే పరిహారమే ముఖ్యం కదా?
జడ్చర్ల టౌన్: భూ నిర్వాసితులకు చికెన్ భోజనం అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారని, మా నిర్వాసితులకు చికెన్ భోజనం కన్నా పరిహారం పెంపు ముఖ్యమనేది విస్మరించారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ బాధితులకు ఆర్‌ఎన్‌ఆర్ ప్యాకేజీ కింద ఇంటి నిర్మాణం కోసం రూ.16 లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ గ్రామ సమీపంలో నిర్వాసితులకు పెట్టిన చికెన్ భోజనం కోసం రూ.9 లక్షలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. శుక్రవారం బాదేపల్లి పెద్దగుట్టపై విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఎక్కడా లేని విధంగా ఇంటి నిర్మాణం కోసం 300 గజాలు కేటాయించేలా స్థల ఎంపిక సైతం చేశామని గుర్తుచేశారు. కొన్నాళ్ల కిందట నిర్వాసితులు ఆందోళన చేస్తుంటే వెళ్లి ఆరు నెలల్లో రూ.16 లక్షలకు బదులుగా రూ.25 లక్షలు ఇప్పిస్తానని, లేకపోతే తాను సైతం ధర్నాలో పాల్గొంటానని చెప్పి ఆందోళన విరమింపజేసిన ఎమ్మెల్యే ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడి లేరని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయ్యాయని, గెలిచి రెండేళ్లు కావొస్తున్నా పనులు ముందుకు సాగలేదని ఆరోపించారు. ఇచ్చిన హమీలను నిలబెట్టుకోకపోగా.. అసమర్థుడిగా పనులు చేయలేక ఇతరులపై ఆరోపణలు, నిందలు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఇకనైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచ్‌ల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్ తదితరులు పాల్గొన్నారు.