
జూరాలకు భారీగా వరద
ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. బుధవారం రాత్రి 7.30 ప్రాంతంలో 2.92 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 44 క్రస్ట్ గేట్లు పైకెత్తి 3,22,179 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 10,663 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 20, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.585 టీఎంసీలు ఉన్నట్లు చెప్పారు.
నిర్విరామంగా విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్: జూరాల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 247.422 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 286.158 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని ఎస్‌ఈ శ్రీధర్ వివరించారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 533.580 మి.యూ. విజయవంతంగా చేపట్టామన్నారు.
రామన్‌పాడు నుంచి 15 వేల క్యూసెక్కులు..
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయానికి బుధవారం శంకరసముద్రం, సరళాసాగర్, ఊకచెట్టువాగు నుంచి వరద రావడంతో 7 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.
సరళాసాగర్ సైఫన్ల నుంచి..
మదనాపురం: సరళాసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం రెండు ఉడ్ సైఫన్లు, రెండు ప్రైమరీ సైఫన్ల నుంచి 7,800 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. మదనాపురం వద్ద వాగు పారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కోయిల్‌సాగర్ జలాశయం వద్ద..
దేవరకద్ర: కోయిల్‌సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బుధవారం ఉదయం 5 గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 4,500 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. మంగళవారం రెండు గేట్లను తెరవగా.. రాత్రి కురిసిన వర్షానికి జలాశయానికి భారీగా వరద చేరడంతో బుధవారం ఉదయం 5 గేట్లను తెరిచారు. సాయంత్రం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో రెండు గేట్లు, తర్వాత మరో గేటు మూసి వేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32 అడుగులు ఉంది.
నిండుకుండలా సుంకేసుల..
రాజోళి: సుంకేసుల జలాశయానికి వరద రోజురోజుకు పెరుగుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. బుధవారం ఎగువ నుంచి 1.45 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 19 గేట్లను రెండు మీటర్ల మేర, డ్యాంకు ఒక గేట్‌ను మీటర్ మేర తెరిచి 1, 39,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. కేసీ కెనాల్‌కు విడుదల చేసి న 2,534 క్యూసెక్కులతో కలిపి డ్యాం నుంచి 1,41, 634 క్యూసెక్కులు దిగువకు పారినట్లు చెప్పారు.
2.92 లక్షల
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
44 క్రస్ట్ గేట్లు ఎత్తి
దిగువకు నీటి విడుదల
కొనసాగుతున్న
విద్యుదుత్పత్తి