కోడేరు: విద్యుదాఘాతంతో ఎద్దులు మృత్యువాత పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మాచుపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు రాములు ఇంటి వద్ద పశువుల పాకలో ఎద్దులను కటేశాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో 11కేవీ విద్యుత్‌తీగలు తెగి ఎద్దులపై పడటంతో రెండు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం ఏర్పడిందని బాధితుడు పేర్కొన్నాడు.
లభించని చిరుత ఆనవాళ్లు
గండేడ్: వాహనదారుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని అటవీ శాఖ మహమ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్‌హై ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ బుధవారం పరిశీలించారు. మంగళవారం మండలంలోని లింగాయపల్లి గ్రామ సమీపంలో నరేష్ అనే వ్యక్తి బైక్‌పై వస్తుండగా చిరుత అకస్మాత్తుగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితుడు నరేష్ వద్దకు వెళ్లి విచారించి సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు.
బాధితుడు చింతగుట్ట వైపు వెళ్లినట్లు చెప్పడంతో అధికారులు పంట పొలాలతోపాటు ఖాళీ ప్రదేశాలను కలియదిరిగారు. అయితే చిరుతకు సంబంధించి పాదముద్రలు ఏమీ లభించలేదని అటవీ అధికారి తెలిపారు. చిరుతకు సంబంధించి ఆనవాళ్లు ఏమీ లేకపోవడంతో దాడి చేసింది కచ్చితంగా చిరుత అని చెప్పలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.