
త్వరలో సీఎంను కలిపిస్తాం
నారాయణపేట: నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయించేందుకు త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిపిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి భూ నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. మంగళవారం రాత్రి మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి చొరవతో మంత్రి దామోదర రాజనరసింహాను నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలోని భూ నిర్వాసితుల సంఘం సభ్యులు, అఖిలపక్షం నాయకులు, భూ నిర్వాసితులు కలిసి తమ గోడును వినిపించారు. భూ నిర్వాసితులకు బేసిక్ ధరను 2013 భూ చట్టాన్ని, ప్రస్తుత మార్కెట్ ధరను పట్టించుకోకపోవడంతో భూ నిర్వాసితులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.2.25 లక్షలు ప్రభుత్వ మార్కెట్ ధర ఉందంటూ కేవలం రూ.14 లక్షలు చెల్లిస్తుండడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. కానీ మార్కెట్ ధర రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు పలుకుతుందన్నారు. కాస్తుకు, రికార్డు మధ్య పొరపాటు ఉందని వాటిని సరి చేయాలని, ఇంటికో ఉద్యోగం, పింఛన్ సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ పథకాల్లో అవకాశం కల్పించాలని భూనిర్వాసితులు మంత్రులను కోరారు. తాము ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని.. భూ పరిహారాన్ని రూ.35 లక్షలు పెంచి ఇవ్వాలనేదే తమ కోరిక.. డిమాండ్ అని తెలిపారు. అనంతరం మంత్రులు స్పందిస్తూ త్వరలోనే సీఎంతో మాట్లాడించి భూ నిర్వాసితులకు తగు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రులను కలిసిన వారిలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి వెంకట్రాంరెడ్డి , అధ్యక్షుడు మశ్చందర్, రైతు సంఘం నాయకులు వెంకోబ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్, భూ నిర్వాసితులు గోపాల్‌రెడ్డి, రమేశ్‌శెట్టి, బీజేపీ నాయకుడు భాస్కర్ తదితరులు ఉన్నారు.
భూ నిర్వాసితులకు
న్యాయం చేయిస్తాం
భరోసానిచ్చిన మంత్రులు