ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగిరం చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకంపై ఎంఎస్‌ఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన వెబెక్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనవి ఎన్ని.. బేస్మెంట్ లెవెల్ నిర్మాణం ఎన్ని పూర్తి చేశారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అప్లికేషన్ లెవెల్‌లో ఉన్నవి పరిశీలించాలని, రేషన్ కార్డులు లేనివి, కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ మంజూరైతే పరిశీలించి తీసివేయాలని, రెండో విడత అప్లికేషన్లను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అప్రూవ్ చేసిన వాటిని ప్రొసీడింగ్స్ ఇచ్చి మంజూరు చేస్తామన్నారు. వర్షాకాలం రాక ముందే ఇంటి నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. రెడ్ ఫ్లాగ్ ఉన్న అప్లికేషన్లను శుక్రవారంలోగా మళ్లీ పరిశీలించి అప్రూవల్ కోసం పంపించాలని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి డబ్బుల సమస్య ఉంటే అలాంటి వారికి ఐకేపీ లేదా శ్రీనిధి ద్వారా రుణాలు ఇప్పించాలని, ఒకవేళ అర్హులైన వారు ఇల్లు కట్టుకునేందుకు నిరాకరిస్తే వారి నుంచి లెటర్ తీసుకుని రద్దు చేయాలని సూచించారు. మెటీరియల్ చార్జెస్, మేసీ్త్రకి ఇవ్వాల్సిన డబ్బులను సైతం పరిశీలించాలని, ఇసుక పంపిణీ గురించి తహసీల్దార్లను సంప్రదించాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, అప్లికేషన్ సరిగా ఉంటే సిబిల్ స్కోరు వివరాలు పరిశీలించేందుకు బ్యాంక్ మేనేజర్లకు ఎన్ని అప్లికేషన్లను పంపించారని ఆరా తీశారు. అసలైన లబ్ధిదారులు ఎంపిక చేసేందుకు ప్రజాప్రతినిధులకు అప్లికేషన్ల వివరాలను వారితో కలిసి వెరిఫై చేయాలని, లబ్ధిదారులకు లోన్ మంజూరు కోసం నాన్ ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, హౌసింగ్ పీడీ భాస్కర్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శంకరాచారి, డీవైఎస్‌ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలమర్రిలోపకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 16న పిల్లలమర్రికి ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొననున్న పోటీదారులు రానుండటంతో పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పిల్లలమర్రి సందర్శించనున్న నేపథ్యంలో కలెక్టర్ విజయేందిర ఎస్పీ జానకితో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. పురావస్తు మ్యూజియం, పిల్లలమర్రి వృక్షం, దేవాలయం వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


