మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో గంజాయి, కల్తీ కల్లు కట్టడి కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. గంజాయి, కల్తీ కల్లు నిర్మూలనపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్టర్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం నిషేధిత మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగం, కల్తీ కల్లు తయారీ, సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందిస్తే అలాంటి వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. జిల్లాలో మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోస్టర్లను రద్దీ ప్రాంతాలు బస్టాండ్, రైల్వేస్టేషన్, కళాశాలలో అతికించడంతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.