
వ్యవసాయంలో మహిళలదే ప్రధాన పాత్ర
నారాయణపేట: వ్యవసాయంలో ముఖ్యపాత్ర మహిళలదేనని బీకేఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లావణ్య పేర్కొన్నారు. ప్రతిగ్రామంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సభ్యత్వం చేయిస్తూ, జిల్లా, మండల కమిటీలో వారిని నియమించాలని అన్నారు. శనివారం ఆమె నారాయణపేటను రావడంతో బీకేఎస్ రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు లేనిది వ్యవసాయం చేయలేమన్నారు. ఈప్రాంతంలో రైతులకు కష్టపడే తత్వం ఉందన్నారు. అధికదిగుబడి నిచ్చే వంగడాలు ఉత్పత్తి చేసి అధికలాభాలు చేకూర్చాలని కోరుతున్నామన్నారు. భారతీయ కిసాన్ చాలా పటిష్టంగా ఉందని అన్నారు. భూ సమస్యలు పరిష్కరించుకోవాలని, క్షణిక ఆవేశంలో గొడవలు పెట్టుకోరాదని, సమస్యలు పరిష్కరించడానికి మార్గాలు అన్వేషించాలన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల చిన్నపొర్ల గ్రామంలో భూ వివాదంలో జరిగిన ఘటన చాలా బాధిస్తుందన్నారు. ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్నిచ్చి ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో బీకేఎస్ నాయకులు బాలప్ప, అనంతరెడ్డి, లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, వెంకటప్ప, నాగార్జున, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.