
నీటిగుంతలో పడి రైతు మృతి
బిజినేపల్లి: మండలంలోని మహాదేవునిపేటకు చెందిన రైతు కర్ణాకర్‌రెడ్డి (48) పొలం వద్ద నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. తన వ్యవసాయ పొలం వద్ద నీటి గుంతలో ఉన్న మోటారుకు నాచు తొలగించాలని అందులోకి దిగాడు. ప్రమాదశావత్తు అదే సమయంలో మూర్చ రావడంతో గుంతలో జారి పడ్డాడు. చుట్టు పక్కన ఎవరూ గమనించకపోవడంతో కర్ణాకర్‌రెడ్డి నీటి గుంతలో మునిగి చనిపోయాడు. కాసేపట్లో వస్తానని పొలానికి వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పక్క పోలం రైతులకు సమాచారమిచ్చారు. వారు నీటిగుంత వద్దకు వచ్చి చూడగ కర్ణాకర్‌రెడ్డి గుంతలో పడి చనిపోయి ఉండటం గమనించి కుటుంబ సభ్యులకు, సమాచారం అందించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
బీటెక్ విద్యార్థి మృతి
మహబూబ్‌నగర్ క్రైం: లారీ డ్రైవర్ అతివేగంగా ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యా ర్థికి గాయాలయ్యాయి. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. కేశంపేట్‌కు చెందిన సయ్యద్ తౌసిప్ అన్వర్ అలీ(20) జిల్లా కేంద్రంలోని రామయ్యబౌలిలో ఉంటూ స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం కళాశాల నుంచి మహబూబ్‌నగర్‌కు స్కూటీపై అతని స్నేహితుడు ఖలీల్‌తో కలిసి వస్తుంటే మార్గమధ్యలో ధర్మపూర్ వద్ద మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో సయ్యద్ తౌసిప్ అన్వర్ అలీకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో విద్యార్థి ఖలీల్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
చెంచు విద్యార్థి
ఆత్మహత్యపై కేసు నమోదు
లింగాల: మండలంలోని రాంపూర్‌పెంటకు చెందిన చిగుర్ల రాముడు ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్ శనివారం తెలిపారు. ఫోన్ ఎక్కువగా వాడకంపై తల్లి చిగుర్ల లింగమ్మ మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 11న వారి ఇంటి సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కుక్కల దాడిలో
గొర్రెపిల్లలు మృతి
కొత్తకోట రూరల్: కుక్కలు దాడి చేయడంతో 30గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పెద్దమందడి మండలంలోని జంగమాయపల్లికి చెందిన వంగూర్ రాములు, గౌనికాడి మల్లేష్‌లకు చెందిన గొర్రె పిల్లల మందపై కుక్కులు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధిత గొర్రెల కాపరులు వాపోయారు.

నీటిగుంతలో పడి రైతు మృతి