
వెళ్దామంటే దారులు లేవు
ఎన్నెన్నో అందాలు..
మదనాపురం: వనపర్తి జిల్లాలో రామన్‌పాడు జలాశయం వద్ద ఎన్నెన్నో అందాలు ఉన్నప్పటికి పట్టించుకునే వారు లేక మరుగున పడుతుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పక్షులు కిలకిల అరుపులు, ఊకచెట్టు వాగు లాంటి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఊకచెట్టు వాగు పొంగి పొరిలినప్పుడల్లా ప్రాజెక్టు గేట్లును ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు ప్రాజెక్టును చూడడానికి ప్రజలు తరలివస్తారు. సరైన రహదారులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు చాలా ఉన్నాయి. ఏడాది పొడవునా పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడే ప్రాజెక్టును పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంతా ప్రజలు చెబుతున్నారు.
సాయంత్రం వేళల్లో పక్షుల రాగాలు
ప్రాజెక్టు పక్కన ఉన్న నెమళ్ల గట్టు వద్ద పలు రకాల పక్షులు ఉన్నాయి. సాయంత్రం వేళలో వాటి అరుపులు వింటే ఎంతో మధురానుభూతి కలుగుతుంది. పక్షుల కిలకిల రాగాలతో అ ప్రాంతం గంటన్నర పాటు మార్మోగుతుంది. ఎన్నడూ వినపడని పక్షుల అరుపులు అక్కడ వినిపిస్తాయి.
ప్రాజెక్టుపై వెలగని లైట్లు
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆనకట్ట గుండా 60 లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో లైట్లు వెలిగించేందుకు భద్రత కోసం సిబ్బందిని నియమించారు. కానీ ఈ మధ్యకాలంలో రాత్రి వేళలో లైట్లు వేయడం లేదని ప్రాజెక్టు చిమ్మచీకట్లో కనిపిస్తుందని పరిసర గ్రామాల ప్రజల అంటున్నారు. అజ్జకొల్లు, రామన్ పాడు గ్రామాల ప్రజలు ఆత్మకూరు వెళ్లాలంటే చిమ్మ చీకటిలో ప్రాజెక్టు మీద ప్రయాణం చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని తెలుపుతున్నారు.
గుంతలమయమైన రోడ్డు..
రామన్‌పాడు ప్రాజెక్టుకు వెళ్లాలంటే రోడ్డుమార్గం నరకాన్ని తలపిస్తుంది. గత వర్షాకాలంలో ఊకచెట్టు వాగుకు వరద పోటెత్తడంతో ఆత్మకూర్, అమరచింత మండలాలకు వాహనాలపై వెళ్లడానికి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంతలమయమై బురద నిండి ఉండడంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రాజెక్టు వరకు రోడ్ల మరమ్మతు రూ.10 లక్షలు వెచ్చించి చేపట్టిన ఫలితం లేకపోయింది. అక్కడక్కడ కంప చెట్లు తొలగించి వదిలేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకే తాగు, సాగునీరు అందించే జలాశయం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సౌకర్యాలు లేక మరుగునపడుతున్న రామన్‌పాడు జలాశయం

వెళ్దామంటే దారులు లేవు