Sakshi News home page

దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న కోస్గి.. దీనికి కారకులు ఎవరు?

Published Mon, Nov 27 2023 1:10 AM

- - Sakshi

కోస్గి: ఓటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్ది కొడంగల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోరు ముదురుతుంది. ముఖ్యంగా కోస్గి మండలంలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు నువ్వా నేనా అన్నట్లు కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. ప్రచార హోరు పక్కన పెడితే ఏకంగా దాడులు, ప్రతిదాడులతో మండలంలో భయంకరమైన వాతావరణం సృష్టించడంతో ప్రజలు తీవ్ర భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఏకంగా ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో పాటు అతని కుమారుడు, అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కుమారుడు హితీష్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ముదిరెడ్డిపల్లి, అమ్లికుంట్లకు వెళ్లాడు. అక్కడ కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు డబ్బులు పంచడానికి వచ్చారంటూ వాహనాన్ని అడ్డుకోవడంతో వెనుదిరిగినప్పటికి అమ్లికుంట్ల, బోగారంలో రోడ్డుకు అడ్డంగా రాళ్లు వేసి వాహనాన్ని ఆపి దాడి చేశారు.

వాహనం ధ్వంసమైంది. ఈ క్రమంలో అదేరోజు అర్ధరాత్రి కాంగ్రెస్‌ కార్యకర్త కూర నరేష్‌ ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి డెకరేషన్‌ పనులు ముగించుకొని వెళ్తున్న క్రమంలో కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు అతన్ని ఆపి మూకుమ్మడిగా దాడి చేసి కారులో బలవంతంగా ఎత్తుకెళ్లి తీవ్రంగా కొట్టారు. తలపగిలి తీవ్ర గాయాలతో ఉన్న నరేష్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తన ఆందోళనకు దిగారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ శిరీష ఇంటికి, ఇతర నాయకుల ఇళ్లకు వెళ్లి వాగ్వా దానికి దిగారు. రేవంత్‌రెడ్డి సోదరుడు బాధితుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, అతని కుమారుడు హితీష్‌రెడ్డితోపాటు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ భర్త మ్యాకల రాజేష్‌, కౌన్సిలర్‌ బాలేష్‌, బోరబండ కార్పొరేషన్‌ బాబా ఫసీయోద్దీన్‌, వెంకట్‌నర్సింహులు, మీర్జాపూర్‌ రాజేందర్‌రెడ్డి, కోనెరు సాయప్ప, అమీర్‌ షేక్‌పై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా శనివారం అర్ధరాత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి తన అనుచరులతో వచ్చి ప్రతాప్‌రెడ్డి ఫాంహౌస్‌లో నుంచి వస్తున్న క్రమంలో తనపై, తన అనుచరులపై దాడి చేసి గాయపరచడంతోపాటు తన వాహనాన్ని వెంబడించి హత్యాయత్నం చేశారని బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియోద్దీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతవారం ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే ఇరుపార్టీల నేతలు గొడవ పడి రాళ్లతో దాడులు చేసుకోవడం, ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజా దాడులు, ప్రతిదాడులతో కోస్గిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్న ఎన్నికల రణరంగంతో ప్రజలు తీవ్ర భయందోళకు గురవుతున్నారు.

Advertisement
Advertisement