సర్పంచ్‌ నుంచి మంత్రిగా..

వైద్య విద్యను అభ్యసించిన జడ్చర్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజకీయాల్లో రాణించారు. జడ్చర్ల నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో బీహెచ్‌ఎంఎస్‌ విద్యను పూర్తిచేశారు. వైద్య విద్య పూర్తవగానే యుక్తవయస్సులోనే లక్ష్మారెడ్డి 1988లో ఆవంచ సర్పంచ్‌గా ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో క్రీయాశీలక పాత్ర పోషించారు. తిమ్మాజిపేట మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1995లో తిమ్మాజిపేట సింగిల్‌విండో అధ్యక్షుడిగా, 1996లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వ్యవహరించారు. 1999లో జడ్చర్ల ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. తదుపరి 2001లో బీఆర్‌ఎస్‌లో చేరి 2004 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టికెట్‌ దక్కలేదు. 2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో జడ్చర్ల ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

వైద్య విద్యను పూర్తిచేసిన పలువురు డాక్టర్లు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ప్రజాక్షేత్రంలో తలపడనున్నారు. ఎండీ, ఎంఎస్‌,ఎంబీబీఎస్‌, ఎండీఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ తదితర వైద్యశాస్త్ర కోర్సులను పూర్తిచేసిన విద్యావంతులు ఎమ్మెల్యేగా పోటీపడుతున్నారు. ఇప్పటికే మాజీమంత్రులు నాగం జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వీఎం అబ్రహం తదితరులు ఎమ్మెల్యేలుగా రాణించగా.. వీరి స్ఫూర్తితో మరింత మంది వైద్యులు రాజకీయరంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

– సాక్షి, నాగర్‌కర్నూల్‌

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top