
జడ్చర్లలో ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల/ నవాబుపేట: కారు గుర్తుకు ఓటేస్తే కార్లలో తిరుగుతారని 2014లో జరిగిన ఎన్నికల సమయంలో చెప్పానని, తాను చెప్పినట్లుగానే ప్రస్తుతం జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్లలో రూ.1.70 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహాన్ని ప్రారంభించి, నవాబుపేట మండలంలోని దేపల్లి, బట్లోనిపల్లితండా, వెంకటేశ్వరతండా, రెడ్యానాయక్‌తండా, లింగంపల్లి గ్రామాల్లో పంచాయతీ భవనాలకు, బీటీరోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు మరిచిపోయి ఓటేసినా.. పాపం తగులుతుందని పొరపాటున కూడా ఆ పార్టీకి ఓటేయొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో తండాల అభివృద్ధి జరగలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే గిరిజన తండాల దశ తిరిగిందన్నారు. కారుగుర్తుకు ఓటేస్తే మీ పిల్లలు కార్లలో తిరుగుతారని నాడు ఎన్నికల ప్రచారంలో తాను చెప్పానని.. ప్రస్తుతం ఏ తండాలో చూసినా నాలుగైదు కార్లు కనిపిస్తున్నాయని, ఇదే బంగారు తెలంగాణకు నిదర్శనం అన్నారు. ఇది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కేసీఆర్‌ను సీఎం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు. అనంతరం ఊర్కొండ మండలం నర్సంపల్లికి చెందిన పలు పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నర్సింహులు, ఎంపీపీ అనంతయ్య, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, రైతుబంధు చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్నయ్య, కోఆప్షన్ సభ్యుడు తాహేర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్‌లు గోపాల్‌గౌడ్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.