● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
మహబూబాబాద్ రూరల్: వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలం వేమునూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. రానున్న వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున, పంపిణీ వ్యవస్థను ముందస్తుగా పటిష్టం చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులను ప్రాధాన్యత క్రమంలో గడువులోగా పూర్తి చేయాలన్నారు. రానున్న వేసవిలో పెరిగే విద్యుత్ లోడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌లు), పవర్ ట్రాన్‌ఫార్మర్ల (పీటీఆర్‌లు) సామర్థ్యాలను పెంచడంతో పాటు అదనపు ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వినియోగదారులకు వేసవిలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీఎండీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ దర్శన్ కుమార్, డీఈ, ఏడీఈ (ఆపరేషన్), ఏడీఈ (కన్‌స్ట్రక్షన్)తో పాటు ఓఅండ్‌ఎం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధం
డోర్నకల్/కురవి: రాబోయే వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే విద్యుత్ సమస్యలను ఎదుర్కొనేందుకు విద్యుత్‌శాఖ సిద్ధంగా ఉందని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. సీరోలు మండలం మన్నెగూడెం నుంచి సీరోలు వరకు చేపడుతున్న 33కేవీ ఇంటర్‌లింకింగ్ లైన్ పనులను మంగళవారం వరుణ్‌రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మహబూబాబాద్ సర్కిల్ ఎస్‌ఈ దర్శన్‌కుమార్, డీఈ కోటేశ్వర్‌రావు, ఏడీఈలు రమేశ్, ఐలయ్య, ఏఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


