మత్స్యశాఖకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

మత్స్యశాఖకు గ్రహణం

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

వరుస సంఘటనతో బెంబేలు..

● అధికారులకు అవినీతి మరకలు

● వరుస సంఘటనలతో బెంబేలు

సాక్షి, మహబూబాబాద్‌: తెలంగాణలోని పల్లెల్లోనే సంపద సృష్టించాలి.. ఇందుకోసం మత్స్యశాఖను బలోపేతం చేయాలని ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఇక్కడ పనిచేసిన పలువురు అధికారులకు సంపద పెంపునకు దోహదపడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన అధికారులు వక్రమార్గంలో డబ్బులు సంపాదించడంలో ఆరితేరడం, ఇదే తంతును మరో ప్రాంతానికి వెళ్లినా.. కొనసాగించడంతో అక్కడి వారు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇక్కడ పనిచేసేందుకు రావాలంటే అధికారులు వణుకుతున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతుంది. కాగా జిల్లాలో చెరువులు 1,264, మత్స్య సొసైటీలు 200, సొసైటీ సభ్యులు 10,942 మంది ఉన్నారు.

అసలేం జరుగుతోంది..

జిల్లా మత్స్యశాఖకు అధికారులు వచ్చీరాగానే అవినీతి ముద్ర పడటం, గతంలో చేసిన తప్పుల కు ఇక్కడకి వచ్చిన తర్వాత శిక్షలు పడటం, లేదా .. జిల్లా నుంచి వెళ్లిన తర్వాత వేటు పడటం వంటి సంఘటనల నేపథ్యంలో జిల్లాలో ఏం జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. జిల్లాకు అధికా రి రాగానే కొందరు దళారులు మచ్చిక చేసుకుని పరిచయం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొత్త సొసైటీలు, కొత్త సభ్యత్వాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి నామ మాత్రం డబ్బులు అధికారులకు ఇప్పించి మచ్చిక చేసుకుంటారని ప్రచారం. ఇందుకోసం ఆ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు, జిల్లాలోని కొందరు మత్స్యసొసైటీల్లోని సీనియర్‌ సభ్యులు సహకరించడం సహజంగా మారిందనే ప్రచారం ఉంది. ఇది ఒకెత్తయితే.. ఆ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు అంతా తామై నడిపిస్తామని.. వచ్చిన అధికారి చెప్పినట్లు వింటే సరి.. లేకపోతే సభ్యుల ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయించడం, అధికారిని డమ్మీ చేయించడం పనిగా పెట్టుకుంటున్నారని సమాచారం. దీంతో జిల్లాలో జరిగే ప్రతీ విషయం హైదరాబాద్‌ ఉన్నతాధికారులకు చేరవేయడం.. వంటి ప్రక్రియలతో బెదిరింపులకు పాల్పడం, మంచి అధికారి అయినా అవినీతిపరునిగా మా ర్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అందువల్లనే ఇక్కడ పనిచేసిన అధికారులు రకరకాల పరిస్థితిలో సస్పెన్షన్‌ వేటుకు గురవుతున్నారనే ప్రచారం ఉంది. దీంతో ఇక్కడకు వచ్చేందుకు అధికారులు జంకుతున్నట్లు తెలిసింది.

నూతనంగా ఏర్పడిన మానుకోట జిల్లాలో మత్స్యశాఖ అధికారులుగా పనిచేసిన పలువురు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటూ.. జిల్లా నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ పనిచేసిన బుచ్చి బాబుపై పలు ఆరోపణలు రావడంతో ఆయన బదిలీపై వెళ్లారు. అదే విధంగా జిల్లాకు వచ్చిన అధికారి నాగరాణి గిరిజన, గిరిజనేతర మత్స్యకారులకు చెరువుల కేటాయింపు, నూతన సభ్యత్వాల నమోదులో డబ్బులు అడిగారని పలువురు మత్యకారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆమె జనరల్‌ బదిలీల్లో వరంగల్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆ జిల్లాలో మత్స్యకారుల నుంచి డబ్బులు తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఆ తర్వాత వచ్చిన వీరన్నపై కూడా పలు గ్రామాల మత్స్య సొపైటీ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆయనపై ఖ మ్మం జిల్లా అధికారులు వచ్చి విచారణ చేపట్టా రు. ఆయన తర్వాత వచ్చిన భాస్కర్‌ కొంత కా లం పనిచేశారు. అయితే మత్స్యశాఖ అకౌంట్‌లో ఉన్న రూ.40 లక్షల మేరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సస్పెండ్‌ చేశారు. ఆయన తర్వాత వచ్చిన ఆంజనేయ స్వామిపై వివిధ జిల్లాల్లో పనిచేసిన కాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో సస్పెన్షన్‌ వేటు పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement