నెల్లికుదురు: కుల మత బేధాలు లేకుండా ఉండేందుకే ప్రభుత్వం యూనిఫామ్ అందిస్తుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులు ప్రతీ రోజు యూనిఫామ్‌లోనే పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహా శబరీష్ అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని నైనాల, పార్వతమ్మగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. తరగతి గదుల్లో పిల్లలతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి విద్యా సామర్థ్యాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషన్ లెట్రసీ న్యూమరైజేషన్) స్పాట్ అసెస్మెంట్‌ను స్వయంగా పరిశీలించారు. నైనాల పాఠశాలలో విద్యార్థుల విద్యాసామర్థ్యాలను పరిశీలిస్తున్న క్రమంలో ఉపాధ్యాయుడిని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూ ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీజీ మందుల శ్రీరాములు, తహసీల్దార్ చంద నరేష్, ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎంఈఓ రాందాస్, ఏఎంఓ వెంకటేశ్వర్లు, పానెల్ ఇన్‌స్పెక్షన్ సభ్యుడు యాదగిరి, నైనాల సర్పంచ్ యాసం సంధ్య రమేష్, ఉపసర్పంచ్ ఉపేందర్ గౌడ్, హెచ్‌ఎంలు నరేందర్, రాజు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహా శబరీష్


