మహబూబాబాద్ రూరల్ : జాతీయ లోక్ అదాలత్లో మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు అధిక సంఖ్యలో పరిష్కారమయ్యేలా బీమా కంపెనీల బాధ్యులు, సంబంధిత న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ పిలుపునిచ్చారు. బీమా కంపెనీ అధికారులు, కంపెనీ న్యాయవాదులతో జిల్లా కోర్టులో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మురళీమోహన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. గత లోక్ అదాలత్ సందర్భంగా కేవలం 24 నష్టపరిహార కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయని, ఈసారి కనీసం 50 కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే 16 కేసులను గుర్తించిందని కంపెనీ అధికారి శశికాంత్ వివరించగా జిల్లా జడ్జి ఆయనను అభినందించారు. మిగతా బీమా కంపెనీలు కూడా త్వరగా లోక్ అదాలత్లో పరిష్కరించదగిన కేసులను గుర్తించి వివరాలు న్యాయ సేవా సంస్థకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి, బీమా కంపెనీల న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి మురళీమోహన్


