● మృతురాలి బంధువుల అడ్డగింత.. పీఎస్‌కు తరలింపు
చెన్నారావుపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయపల్లి బుచ్చితండాకు చెందిన అజ్మీరా వైష్ణవి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఐఐటీ కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వైష్ణవి మృతికి చెన్నారావుపేట మండలం పాపయ్యపే ట గ్రామ శివారు అమృతండాకు చెందిన బోడ సుమన్ అని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం వైష్ణవి మృతదేహాన్ని సుమన్ ఇంటి ఎదుట వేసి ఆందోళన చేయడానికి యత్నించగా నెక్కొండ సీఐ ఫణిధర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి మృతదేహాన్ని తీసుకుని అమృతండాలోని సుమన్ ఇంటికి వెళ్లనున్నారనే సమాచారం మేరకు అప్రమత్తమైన సీఐ ఫణిధర్.. చెన్నారావుపేట ఎస్సై గోవర్ధన్‌ను అప్రమత్తం చేశారు. నెక్కొండ మీదుగా వస్తున్న మృతురాలి బంధువులను చెన్నారావుపేట మండలంలోకి ప్రవేశించకుండానే అడ్డుకున్నారు. అనంతరం వారిని చెన్నారావుపేట పీఎస్‌కు తరలించగా అక్కడే ఆందోళన చేపట్టారు. వారిని సముదాయించిన ఎస్సై గోవర్ధన్.. వైష్ణవి మృతదేహంతోపాటు ఆమె బంధువులను నర్సంపేటకు తరలించి ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేశారు. బందోబస్తులో ఎస్సై గోవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.
స్వల్పంగా పెరిగిన
పత్తి ధర
ఖిలా వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటాల్‌కు రూ. 8,700 ధర పలుకగా, బుధవారం రూ. 8,800 జెండా పాటతో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో పత్తి ధరలో రూ. 100 మేర పెరుగుదల ప్రారంభమైంది. రైతులు బుధవారం మార్కెట్‌కు సూమారు 3వేల బస్తాల పత్తి తీసుకొచ్చారు. ధర స్వల్పంగా పెరగడంతో తమ పంటను విక్రయించేందుకు ఆసక్తి చూపారు.
విష జ్వరంతో రైతు మృతి
● ఇప్పగూడెంలో ఘటన
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన రైతు పసునూరి తిరుపతిరెడ్డి(47) విష జ్వరంతో మృతిచెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. తిరుపతిరెడ్డికి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక వైద్యుల వద్ద చికిత్స పొందినా తగ్గలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మురసు తుపాన్ ఎఫెక్ట్..
● కాజీపేట మీదుగా రైళ్లు మళ్లింపు
కాజీపేట రూరల్ : మురసు తుపాన్ ఎఫెక్ట్‌తో న్యూఢిల్లీ నుంచి వయా వరంగల్ మీదుగా విజయవాడ రూట్‌లో ప్రయాణించే రైళ్లను వయా కాజీపేట మీదుగా మంగళవారం దారి మళ్లించి ప్రయాణికులను కాజీపేటలో దింపినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. వరంగల్ మీదుగా వెళ్లే జోగ్‌బని–ఈరోడ్ (16602) అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్, ఇండోర్–కోచ్‌వెలి (22645) అహిల్యానగర్ ఎక్స్‌ప్రెస్, హజ్రత్‌నిజాముద్దీన్–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (12612) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్, భగత్‌కి కోఠి–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (20626) చైన్నె సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాజీపేట మీదుగా మళ్లించి ఈ స్టేషన్‌లో 1,226 మంది ప్రయాణికులను దింపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం 278 మందిని సికింద్రాబాద్–గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో తరలించారు. మిగతా 948 మంది ప్రయాణికులను కాజీపేట నుంచి విజయవాడ వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో మంగళవారం, బుధవారం తెల్ల వారుజాము వరకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.


