120 రోజులైనా ఈనని వరి ! | - | Sakshi
Sakshi News home page

120 రోజులైనా ఈనని వరి !

Nov 4 2026 1:44 AM | Updated on Nov 4 2026 1:44 AM

కొత్తగూడ: మండలంలోని ఎంచగూడెం, సాదిరెడ్డిపల్లి గ్రామాల్లో ఓ కంపెనీకి చెందిన సిద్ది–44 అనే వరి వంగడం వంద ఎకరాల్లో సాగు చేశారు. పంటకాలం 140రోజులు కాగా.. వరినాటు వేసి 120 రోజులైనా ఇప్పటికీ ఈనడం లేదు. చిరు పొట్ట దశలోనే ఉంది. ఎర్రబారిపోతుంది. దీంతో తాము మోసపోయామని బాధిత రైతులు గ్రహించి.. విత్తనాలు విక్రయించిన ఎంచగూడెం గ్రామానికి చెందిన వ్యాపారిని నిలదీశారు. కంపెనీ వారిని పిలిపిస్తామని జాప్యం చేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈక్రమంలో రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించగా.. ఏఈఓ పొలాలను పరిశీలించి వెళ్లారని, తర్వాత ఎలాంటి స్పందన లేదని రైతులు మంగళవారం విలేకరులతో వాపోతున్నారు. అధికారులు సరిగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నష్టపోయాం.. పరిహారం అందించాలి

అధిక దిగుబడి వస్తుందని నాలుగు ఎకరాలు వరి సాగు చేశా. ఎదుగుదల లేదు.. ఈనడం లేదు.. ఎర్రబారి పోయింది. సుమారు 160 బస్తాల దిగుబడి వచ్చేది. ఏంచేయాలో దిక్కు తోచడం లేదు. పరిహారం అందించి ఆదుకోవాలి.

– పుల్సం నారాయణ, రైతు

శాస్త్రవేత్తలకు సమాచారం అందించాం

వరి పొలాలు ఈనడం లేదని ఎంచగూడెం, సాదిరెడ్డిపల్లి రైతులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏఈఓతో సర్వే నిర్వహించాం. ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమాచారం అందించాం. వారు పరిశీలించి ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకుంటాం.

– జక్కుల ఉదయ్‌, మండల వ్యవసాయాధికారి

నిండా ముంచిన సిద్ది–44 రకం వరి

వంద ఎకరాల్లో సాగు.. ఆందోళనలో రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement