మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా ఆర్‌అండ్‌బీ కసరత్తు
పలు రోడ్ల నిర్మాణాలు..
● మానుకోట మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లి గ్రామం నుంచి మానుకోట మండలంలోని రెడ్యాల గ్రామం వరకు 9కిలో మీటర్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఆర్‌ఎఫ్ నిధుల నుంచి రూ.25 కోట్లు కేటాయించారు. సుమారు 80శాతం పనులు పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు.
● మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు గ్రామం నుంచి మానుకోట మండలంలోని పర్వతగిరి గ్రామానికి 9కిలో మీటర్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.17కోట్లతో పనులు చేస్తున్నారు. మట్టి రోడ్డు, 15 కల్వర్టుల పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 20 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు.
● గార్ల –రాంపురం మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం
● కొనసాగుతున్న పలు రోడ్ల నిర్మాణాలు.. తీరనున్న ప్రజల కష్టాలు
మహబూబాబాద్: జిల్లాలో చేపడుతున్న ఆర్‌అండ్‌బీ పనుల్లో కొంత వేగం పెరిగింది. మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గార్ల–రాంపురం మధ్య మున్నేరు(పాకాల) వాగుపై హైలెవల్ బ్రిడ్జి పనులు 50శాతం పూర్తయ్యాయని అఽధికారులు తెలిపారు. పనులు పూర్తయితే రాంపురం ప్రజల కష్టాలు తీరుతాయి. పలు రోడ్ల నిర్మాణాలను వేగం చేస్తున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
మూడు సబ్ డివిజన్‌లు..
జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయం పరిధిలో మూడు సబ్ డివిజన్‌లు ఉన్నాయి. మానుకోట సబ్ డివిజన్ పరిధిలో మానుకోట, గార్ల, బయ్యారం, నెల్లికుదురు, తొర్రూరు, పెద్దవంగర మండలాలు ఉన్నాయి. ఆ డివిజన్ పరిధిలో డీఈ, ముగ్గురు ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. మరిపెడ సబ్ డివిజన్ పరిధిలో మరిపెడ, కురవి, సీరోలు, డోర్నకల్, దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు మండలాలు ఉన్నాయి. ఆ డివిజన్‌లో డీఈ, నలుగురు ఏఈలు పని చేస్తున్నారు. అలాగే గూడూరు సబ్ డివిజన్ పరిధిలో కొత్తగూడ, గంగారం, గూడూరు, కేసముద్రం, ఇనుగుర్తి మండలాలు ఉన్నాయి. డీఈ, ముగ్గురు ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు.
హెలెవల్ బ్రిడ్జి నిర్మాణం..
మానుకోట సబ్ డివిజన్ పరిధిలోని గార్ల–రాంపురం మధ్య మున్నేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెంట్రల్ రిలీఫ్ ఫండ్ (సీఆర్‌ఎఫ్) నిధులు రూ.20 కోట్లతో పనులు చేపడుతున్నట్లు డీఈ కృష్ణమోహన్ తెలిపారు. వాగుపై 250 మీటర్ల పొడవుతో హైలెవల్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. పిల్లర్లు పూర్తి చేశారు. కాగా, ఐదు నెలల్లోనే 50శాతం పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
వాగు ఉధృతమైతే రాకపోకలకు అంతరాయం..
గార్ల– రాంపురం మధ్య దూరం రెండు కిలోమీటర్లు మాత్రమే. వర్షాకాలంలో వాగు ఉధృతి పెరిగితే రాకపోకలు నిలిచిపోతాయి. రాంపురం ప్రజలు రైల్వే ట్రాక్‌పైనుంచి ప్రమాదకరంగా గార్లకు రాకపోకలు సాగిస్తుంటారు. ట్రాక్‌పై నుంచి వెళ్తున్న క్రమంలో ప్రమాదాలు జరిగి కొంతమంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. వాగు వచ్చిన సమయంలో రాంపురం ప్రజలు డోర్నకల్, బయ్యారం తదితర ప్రాంతాల నుంచి గార్లకు వెళ్లాల్సి వస్తోంది. సుమారు 28 నుంచి 30 కిలోమీటర్ల దూరం నుంచి గార్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాగా, వాగుపై హెలెవల్ బ్రిడ్జి పూర్తి అయితే ఆ గ్రామంతో పాటు పలు గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తీరుతాయి. కాగా, మూడు నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తాం
మానుకోట సబ్ డివిజన్‌లో జరుగుతున్న పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తాం. రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మురళీనాయక్, కోరం కనకయ్య సహకారంతో పనులు వేగవంతం చేశాం. గార్ల–రాంపురం మధ్య హైలెవల్ బ్రిడ్జితో పలు గ్రామాల రవాణా సమస్య తీరుతుంది. – రాజు పాండ్యా, ఆర్‌అండ్‌బీ ఈఈ


