● ఫ్లాష్‌వాక్‌లో ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరమని ఎస్పీ శబరీష్ అన్నారు. జాతీయ సైబర్ సెక్యూరిటీ అవగాహన మాసోత్సవంలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీ ఫ్లాష్ వాక్ (ర్యాలీ) నిర్వహించారు. విద్యార్థులు, యువత సైబర్ భద్రతపై అవగాహన కల్పించే నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. పాస్, థింక్, వెరిఫై, సైబర్ హెల్ప్‌లైన్ 1930, నో డిజిటల్ అరెస్ట్ వంటి నినాదాలతో ప్రజలకు సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత సైబర్ భద్రతా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకురావడం అభినందనీయమన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్, ఓటీపీ మోసాలు, బ్యాంకు వివరాలు, బ్యాంకు, పోలీస్ అధికారుల పేరిట బెదిరింపులు, ఇతర అంశాలపై ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ నేరగాళ్లు క్షణాల్లో దోచుకుంటున్నారని, ఇలాంటి మోసాల బారిన పడొద్దని సూచించారు. ఏదైనా అనుమానాస్పద ఫోన్‌కాల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగి, ఆలోచించి, నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. సైబర్ నేరాల నివారణ పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతీ పౌరుడు సైబర్ భద్రతపై అవగాహన పెంచుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు కూడా ఈ విషయాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, రూరల్ సీఐ అంజలి, సైబర్ సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


