సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే దృష్టి సారించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి పెట్టడంతో పాటు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. పట్టభద్రులను ఆకట్టుకోవడం, ఓటర్ల జాబితాలో తమకు అనుకూలమైన అర్హులైన ఓటర్ల నమోదు జరిగేలా అవగాహన కల్పించడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎత్తులు.. పైఎత్తులకు తెరతీస్తున్నాయి.
కాంగ్రెస్.. ప్రభుత్వ పనితీరే ప్రచారాస్త్రంగా..
అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశం అనంతరం నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. తాజాగా హనుమకొండ డీసీసీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొని ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు, సంక్షేమ కార్యక్రమాలు, విద్యావంతులు, నిరుద్యోగుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలను పట్టభద్రుల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
బీఆర్ఎస్.. గత పట్టు నిలబెట్టుకునే యత్నం
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు ఈ ఎన్నికలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. గతంలో పట్టభద్రుల వర్గంలో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకోవడంతోపాటు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి వరంగల్ ముఖ్య నేతలతో కొద్దిరోజుల కిందట భేటీలు నిర్వహించారు. కేసీఆర్ సైతం ఫామ్‌హౌజ్‌లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు, ఉద్యోగుల ప్రయోజనాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ గతంలో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన ఏనుగుల రాకేష్‌రెడ్డి.. ముఖ్య నేతలతో కలిసి ఓటర్ల నమోదు చురుగ్గా సాగిస్తున్నారు.
బీజేపీ.. పట్టభద్రుల్లో పట్టు పెంచుకునేలా..
మరోవైపు బీజేపీ సైతం ఈ ఎన్నికలు తమ రాజకీయ బలాన్ని చాటుకునే అవకాశంగా భావిస్తోంది. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పార్టీ సంస్థాగత బలాన్ని సమన్వయం చేసుకోవడంతోపాటు విద్యావంతులు, ఉద్యోగులు, యువతలో మద్దతును విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, జాతీయ స్థాయి అంశాలతోపాటు ఉద్యోగాలు, విద్య, యువతకు అవకాశాలు, అభివృద్ధి వంటి అంశాలను పట్టభద్రుల ముందుకు తీసుకెళ్లాలన్న తలంపుతో ఉన్నారు. అభ్యర్థి ఎంపిక, స్థానిక రాజకీయ సమీకరణాలు, పట్టభద్రుల్లో పార్టీకి ఉన్న ఆదరణను ఓట్లుగా మలుచుకునే వ్యూహాలు ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావాన్ని నిర్ణయించనున్నాయి.
పట్టభద్రుల సమస్యలే ప్రచార ఎజెండా..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ముందే ఓటర్ల నమోదు రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ఇందులో చురుకుగా వ్యవహరించడంతోపాటు పట్టభద్రులతో నిరంతర సంబంధాలు కొనసాగించడం ద్వారా ఎన్నికల నాటికి అనుకూల వాతావరణాన్ని నిర్మించుకోవాలని పార్టీలు యోచిస్తున్నాయి. అభ్యర్థి ఫలానా అంటూ ఓటరుగా నమోదు చేసుకున్నారా.. తాము చేయాలా అని ఫోన్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే పార్టీలు సన్నాహక సమావేశాలు, ఓటర్ల నమోదు, నాయకుల సమన్వయంపై దృష్టి సారిస్తుండటంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది.
నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌ల
నియామకం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గురువారం ఉమ్మడి వరంగల్ పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించింది. జనగామ నియోజకవర్గానికి బండా శ్రీనివాస్, ఘన్పూర్ (ఎస్సీ)కు నాగుర్ల వెంకన్న, పాలకుర్తికి ఎం.సుధీర్‌కుమార్‌ను నియమించింది. డోర్నకల్ (ఎస్టీ)కు మాజీ ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్ (ఎస్టీ)కు సత్యవతి రాథోడ్‌కు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గానికి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పరకాలకు సమ్మారావు, వరంగల్ పశ్చిమకు బి.వినోద్‌కుమార్, వరంగల్ తూర్పుకు మర్రి యాదవరెడ్డిని నియమించింది. వర్ధన్నపేట (ఎస్సీ)కు మసూద్, భూపాలపల్లికి రామస్వామి నాయక్, ములుగు (ఎస్టీ)కి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బాధ్యులుగా ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, పట్టభద్రులను సంప్రదించడం, ఎన్నికల ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించడం వంటి బాధ్యతలను వీరు నిర్వహించనున్నారు.


