ఉద్యోగాలు వచ్చే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు వచ్చే వరకు పోరాటం

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

● నిరాహార దీక్షలో కళాకారులు

హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మలిదశ ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిదని, అమరవీరుల తర్వాత స్థానం కళాకారులదే అని మాజీ సీఎం కేసీఆర్‌ పదేపదే చెప్పి తమ పొట్ట కొట్టారని పలువురు కళాకారులు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులందరికీ సాంస్కృతిక సారథిలో ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ఉమ్మడి వరంగల్‌ జిల్లాస్థాయి నిరసన, నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు అనుభవం వెంకటేశం మాట్లాడుతూ కళాకారులకు ఉద్యోగావకాశాలు కల్పించకుంటే సీఎం ఇంటి ఎదుట వంటావార్పు చేపడుతామ న్నారు. ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. దీక్షలో వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు పాలాటి రాజు, వెంకటేశం, కళాకారులు నకిరేకంటి కిరణ్‌ కుమార్‌, ఎనుముల రవీందర్‌, మూత రమేశ్‌, యుగేంధర్‌, కౌంటర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఇవ్వాలని

కేసీ వేణుగోపాల్‌కు వినతి

హన్మకొండ చౌరస్తా: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ నాయకుడు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ బుధవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ సచిన్‌ సావంత్‌లను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో తను విద్యార్థి దశ నుంచి కొనసాగుతున్నానని వివరించారు. తన విజ్ఞప్తిని విన్న వేణుగోపాల్‌ సానుకూలంగా స్పందించినట్లు రామకృష్ణ తెలిపారు.

4 బార్లకు 1,170 దరఖాస్తులు

● ఉమ్మడి జిల్లాకు రూ. 11.70 కోట్ల ఆదాయం

నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల పరి ధిలో అదనపు బార్‌ షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 1, జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 1, ములుగు మున్సిపాలిటీలో 1, మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 1 బార్‌ షాపు కేటాయిస్తూ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో మంగళవారం వరకు చివరి అవకాశం ఉండడంతో నర్సంపేట మున్సిపాలిటీ బార్‌కు 131, స్టేషన్‌ ఘన్‌పూర్‌కు 349, ములుగుకు 362, కేసముద్రం మున్సిపాలిటీ బార్‌కు 328 దరఖాస్తులు వచ్చాయి. బార్‌ షాపుల లైసెన్స్‌ కోసం మొత్తం 1,170 దరఖాస్తులు రావడం గమనార్హం. లైసెన్స్‌ దరఖాస్తు ఫీజుకు ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున డీడీలు తీయడంతో రూ.11కోట్ల 70లక్షల ఆదాయం వచ్చింది. మద్యం వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయనే ఆశతో వ్యాపారులు వెనుకాడకుండా రూ.లక్ష ఫీజు చెల్లించారు. ఈనెల 16న లాటరీ విధానం ద్వారా లైసెన్స్‌లు కేటాయించనున్నారు. కాగా, ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 131 బార్లు ఉండగా మరో నాలుగు కొత్తగా మంజూరు కావడంతో ఆ సంఖ్య 135కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement