తల్లిదండ్రులకు తీరని శోకం..
కురవి: దసరా సెలవుల్లో అమ్మమ్మ ఇంటి వద్ద స్నేహితులతో ఆడుకుంటూ ఆనందంగా గడుపుతున్న ఆ బాలుడిని నీటి గుంత మింగింది. ఆ తల్లిదండ్రులు అంతకుముందే కూతురును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండగా ప్రస్తుతం రెండో సంతానమైన కుమారుడిని మృత్యువు నీటి గుంత రూపంలో కబళించడంతో గుండెలు పగిలేలా విలపించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారు కాకులబోడు తండాలో చోటు చేసుకున్న విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఐదో వార్డుకు చెందిన బోడ హరీశ్, అరుణ దంపతుల కుమారుడు అక్షిత్ (9) స్థానిక కేరళ గ్లోబల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో మంగళవారం కురవి మండలం నేరడ శివారు కాకులబోడు తండాలోని అమ్మమ్మతాత బానోత్ సరోజ, మల్సూర్ ఇంటికి వచ్చాడు. తండా పక్కనే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న ప్రదేశానికి సమీపంలో గుంతలున్నాయి. ఈ క్రమంలో బుధవారం స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఆ గుంతల వద్దకు వెళ్లిన అక్షిత్ ప్రమాదశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ విషయాన్ని స్నేహితులు వెంటనే అక్షిత్ మేనమామ నరేశ్‌కు చెప్పడంతో ఆయనతోపాటు తండావాసులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు, తండావాసులు అక్షిత్ మృతదేహం మీద పడి బోరున విలపించారు. సెలవుల్లో అమ్మమ్మ ఇంటికొచ్చి చనిపోయావా బిడ్డా అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
హరీశ్, అరుణ దంపతులకు మొదటి సంతానంగా కూతురు జన్మించింది. అనారోగ్య కారణాలతో ఆ చిన్నారిని కోల్పోయారు. ప్రస్తుతం కుమారుడు అక్షిత్‌ని సైతం మృత్యువు నీటి గుంత రూపంలో కబళించి ఆ కుటుంబానికి తీరనిశోకం మిగిల్చింది. దీంతో ఇద్దరు సంతానాన్ని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
నీటి గుంతలో పడి బాలుడి మృతి
కాకులబోడు తండాలో ఘటన


