హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం అమ్మవారికి ఘనంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, దత్తకుమార్శర్మ, భరత్శర్మ ఉదయం నుంచి ప్రభాతసేవ, అభిషేకాలు, అర్చనలు జరిపారు. శ్రీరుద్రశ్వరీదేవి ఉత్సవమూర్తికి చతుఃషష్టి ఉపచారపూజలు, కూష్మాండి క్రమంలో దుర్గార్చన చేసి శ్రీమహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు. యాగశాలలో గణపతి రుద్రహవనం, చండీహనం, లక్ష్మీదుర్గ హోమం నిర్వహించారు. సాయంత్రం దాత కోన శ్రీకర్ అందించిన వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, భద్రకాళి దేవాలయం నూతన ధర్మకర్తల మండలి స భ్యుడు మాడిశెట్టి సతీశ్, పల్లం రమేశ్, తౌటిరెడ్డి రవీందర్రెడ్డి, స్వరూప, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వర్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అలరించాయి.


