నెహ్రూసెంటర్: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఇంటర్న్ డాక్టర్స్ గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫారన్‌లో వైద్య విద్య చదివి ఇండియాలో పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యామని ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్నప్పటికీ కనీస వేతనం, స్టైఫండ్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎంజీ వైద్యులతో సమానంగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ఐఎంజీ, ఎఫ్‌ఎంజీ వైద్యులకు చెల్లించే వేతనాలు, స్టైఫండ్‌లో తేడాలున్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వైద్యులందరికీ సమాన వేతనాలు అందించాలని కోరారు. వైద్యవిద్యను పూర్తి చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌజ్‌సర్జన్లుగా, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని సరైన వేతనాలు, స్టైఫండ్ లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. స్టైఫండ్, వేతనాల పెంపు కోసం వైద్య సేవలు నిలిపేసి దశలవారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు ఓపీ, వార్డు సేవలు నిలిపేస్తున్నట్లు, 11వ తేదీ నుంచి 13 వరకు క్యాజువాలిటీ డ్యూటీ బంద్, 14న డీఎంఈ కార్యాయం ఎదుట ధర్నా చేయనున్నట్లు ఇంటర్న్ డాక్టర్స్ పేర్కొన్నారు.


