కలెక్టర్‌ మేడమ్‌కు నమస్కరించి.. | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ మేడమ్‌కు నమస్కరించి..

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 10 శ్రీ జూన్‌ శ్రీ 202
జిల్లా పాలనాధికారి స్నేహశబరీష్‌కు మారుమూల ప్రాంత విద్యార్థిని లేఖ

సాక్షి, మహబూబాబాద్‌: ‘శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మేడమ్‌ గారికి నమస్కరించి రాయునది. నేను జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని. పదిరోజుల నుంచి మా అమ్మానాన్నలు ఒకటే గొడవ. ఒకరు ప్రైవేట్‌ బడికి పంపుదాం అంటే మరొకరు సర్కారు బడికి పంపుదామని అంటున్నారు. నాకేమో సర్కారు బడికే వెళ్లాలని ఉంది. కానీ, సమస్యలతో ఉన్న సర్కారు బడిని బాగుచేస్తే నాలాంటి పేద పిల్ల లు చదువుకునే అవకాశం ఉంటుంది. నా విన్నపాన్ని మన్నించి మీరు బడులు బాగు చేయిస్తారు.. మంచి చదువు చెప్పిస్తారని నా నమ్మకం. ఈ విషయాలన్నీ మీకు నేరుగా కలిసి చెప్పాలనే అనుకున్నా.. కానీ నేను చిన్నపిల్ల ను.. మీ దగ్గరకు రాలేక.. నేరుగా కలువలేక.. ఈ లేఖ రాస్తున్నాను.’

పర్యవేక్షణ లేక..

మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు సరిగ్గా బోధించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రోజు బడికి వెళ్లినా.. ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నాం. రెగ్యులర్‌ ఎంఈఓలు లేకపోవడంతో ఆ మండలంలోని సీనియర్‌ పీజీ హెచ్‌ఎంలకే ఎంఈఓల బాధ్యతలు అప్పగించారు. వారికి వివిధ రకాల రిపోర్టులు ఇవ్వడం, వారి సొంత పాఠశాలలను చూసుకోవాల్సి ఉండడంతో పాఠశాలల పనితీరు.. ఉపాధ్యాయుల రాకపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. కాగా, ఈనెల 15నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా.. సమస్యలు స్వాగతం పలకనున్నాయి.

కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో సమస్యలు..

తల్లిదండ్రులు లేని వారు, పేద ఆడపిల్లలు చదివే కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను బోధించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ మోడల్‌ స్కూళ్లు ఎవరికి పట్టని విధంగా మారాయి. గత ఏడాది పలు మోడల్‌ స్కూళ్లలో జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే భయంగా ఉంది.

తీరని సమస్యలు..

జిల్లా వ్యాప్తంగా 762 ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌ ఉన్నాయి.

ఇందులో పది పాఠశాలలకు భవనాలు లేవు. ఇందులో ఆరు పాఠశాలలు అద్దె భవనాలు, రెండు పాఠశాలలు రెంట్‌ ఫ్రీ భవనాలు, మరో రెండు పాఠశాలలు చెట్లకింద నిర్వహిస్తున్నారు.

338 పాఠశాలలకు ప్రహరీలు ఉండగా.. 92 పాఠశాలల ప్రహరీలు కూలిపోయాయి.

మరో ఐదు పాఠశాలలకు ఫెన్సింగ్‌ వేశారు.

222 పాఠశాలలకు ప్రహరీలు లేవు.

98 పాఠశాలల్లో ప్రహరీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో ఏడు నిర్మాణాల్లో ఉన్నాయి.

21 పాఠశాలలకు విద్యుత్‌ కనెక్షన్లు లేవు. ఆరు పాఠశాలలకు కనెక్షన్లు ఉన్నా మరమ్మతులకు గురయ్యాయి.

17 పాఠశాలల్లో టాయిలెట్స్‌ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

272 పాఠశాలల్లో వంట గదులు లేవు. దీంతో ఆరుబయట వంట చేస్తున్నారు.

సమస్యలతో ప్రభుత్వ బడులు సతమతం

ఎంఈఓల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం

15నుంచి పాఠశాలల పునఃప్రారంభం

ప్రత్యేక దృష్టిపెట్టి సౌకర్యాలు కల్పించాలని వినతి

కలెక్టర్‌కు వినతి చేస్తున్న విద్యార్థిని

Advertisement
 
Advertisement
Advertisement