మహబూబాబాద్ రూరల్ : వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల రైతులను కలవరపెడుతోంది. డీజిల్ రేట్ల పెంపుతో ఇప్పటికే ట్రాక్టర్, హార్వెస్టర్ కిరాయిలు పెరిగి ఆందోళన చెందుతున్న రైతులు.. తాజాగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు చూసి లబోదిబోమంటున్నారు. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని సాకుగా చూపుతూ కంపెనీలు ఒక్కో బస్తాపై రూ.300కుపైగా పెంచేశాయి. గత వానా కాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్ ఎరువుల ధరలు మూడు, నాలుగుసార్లు పెరిగాయి. ఏదో ఓ సాకుతో కంపెనీలు పోటాపోటీగా ధరలు పెంచుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా, డీఏపీ ధరల్లో మార్పులు లేకపోవడం గమనార్హం.
యుద్ధం పేరుతో..
దేశంలో ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులను కంపెనీలు పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా గ్యాస్, పెట్రోల్ సరఫరాకి అంతరాయం కలగడం, రవాణా చార్జీలు పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడంతో మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు పెరిగి, ఆ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడినట్లు చెబుతున్నారు.
మూడు నుంచి నాలుగుసార్లు పెంపు..
గత వానాకాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు మూడు నుంచి నాలుగుసార్లు పెంచాయని ఫర్టిలైజర్స్ డీలర్లు చెబుతున్నారు. మరోవైపు ఫర్టిలైజర్ డీలర్లకు రవాణా చార్జీలు చెల్లించకపోవడంతో ఆ భారాన్ని కూడా రైతులపైనే మోపుతున్నారు. యూరియా బస్తా ధర రూ.265 కాగా కంపెనీలు డీలర్లకు రూ.15 మాత్రమే మార్జిన్ ఇస్తున్నాయి. ఒక్కో బస్తాకు హమాలీ చార్జీ రూ.15, రవాణా చార్జీ రూ.30 నుంచి రూ.35 కలిపి అదనంగా రూ.50 దాకా వసూలు చేస్తున్నారు. రూ.265 యూరియా బస్తాకు రైతులు రూ.300కుపైగా చెల్లిస్తున్నారు.
ఎరువులు పాత ధర పెరిగిన ధర
(రూ.లలో) (రూ.లలో)
20:20:0:13 1,500 1,800
10:26:26 2,025 2,250
12:32:16 2,025 2,250
14:35:14 2,175 2,400
19:19:19 2,075 2,300
ఎంఓపీ 1,850 1,975
కాంప్లెక్స్ ఎరువుల రేట్లు ౖపైపెకి..
రైతులపై అదనపు ఆర్థిక భారం


