● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : గంజాయి మత్తులో యువత తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ శబరీష్ అన్నారు. గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో ఎస్పీ మంగళవారం పర్యటించారు. ప్రజలకు గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించి పోస్టర్లను విడుదల చేసి, కాలనీలోని గోడలకు అతికించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి వాడకం వల్ల మెదడు దెబ్బతినడం, ఆలోచనా శక్తి తగ్గడం, శ్వాసకోశ సమస్యలు, డిప్రెషన్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. గంజాయి మత్తు చదువు, ఉద్యోగం, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని, గంజాయి సమాచారం అందించి రూ.5 వేల నగదు బహుమతి పొందాలని సూచించారు. గంజాయికి సంబంధించిన ఎటువంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే 87126 56999 నంబర్‌లో తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. గంజాయిలేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని, దీనికి ప్రజలందరూ బాధ్యతతో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మాలోత్ శ్రీదేవిబాలు, పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.


