● డీఏఓ ఎస్.విజయచంద్ర
మహబూబాబాద్ రూరల్ : రైతులకు యూరియా యాప్ ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించాలని డీఏఓ ఎస్.విజయచంద్ర అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతువేదికలో యాప్ ద్వారా ఎరువుల విక్రయాలపై సొసైటీ, వ్యవసాయ అధికారులకు మంగళవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. వానాకాలం 2026లో జిల్లాలో యూరియా సరఫరా, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, హాకా రైతు కేంద్రాలు, ఓడీసీఎంఎస్ రైతు విక్రయ కేంద్రాల బాధ్యులకు యూరియా యాప్ ద్వారా పంపిణీ సులభతరం అవుతుందని తెలిపారు. ఆయా కేంద్రాలు నిల్వలు, రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు విధిగా నిర్వహించాలని, ఎరువులను గరిష్ట ధరకు మించి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి విజయకుమారి, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ శ్యామ్ కుమార్, మార్క్ ఫెడ్ అధికారి రవి, హాకా మేనేజర్ అరుణ, ఏడీఏలు శ్రీనివాసరావు, శ్రీదేవి, టెక్నికల్ ఏడీఏ మురళి, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, సొసైటీ అధికారులు పాల్గొన్నారు.


