● బ్యాంకు అప్రైజర్‌ను తొలగించిన బీఎం
బచ్చన్నపేట : గోల్డ్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లిన ఓ ఖాతాదారుడి గొలుసులోని కొంత భాగం మాయమైంది. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. బాధితుడు బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కట్కూర్‌కు చెందిన బాధితుడు తమ్మడి శ్రీకాంత్ కథనం ప్రకారం.. శ్రీకాంత్ సుమారు 22.2 గ్రాముల బంగారు గొలుసును గోల్డ్ లోన్ కోసం బ్యాంకులో అప్రైజర్ సిరివి రూపారాం అలియాస్ ప్రకాశ్‌కు చూపించాడు. గోల్డ్ తనిఖీ ప్రక్రియ అనంతరం గొలుసులోని కొంత భాగం కనిపించకపోవడంతో బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. అనంతరం పరిశీలించగా మాయమైన భాగం గోల్డ్ అప్రైజర్ డ్రాలో కనిపించింది. ఈ ఘటనతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గోల్డ్ తనిఖీ నిర్వహించే ప్రాంతంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఈలాంటి ఘటనలు జరిగాయని దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ ఆర్. రాజును వివరణ కోరగా గొలుసు నుంచి కొంత భాగం తీశానని గోల్డ్ అప్రైజర్ ఒప్పుకున్నాడని, చైన్ ఓ రింగు విరిగి ఉండడంతో డ్రాలో వేశానని తెలిపాడన్నారు. ఈ విషయమై ఆ అప్రైజర్‌ను తొలగించామని మేనేజర్ పేర్కొన్నారు.


